India: పాకిస్థాన్ జైల్లో గుజరాత్ మత్స్యకారుడు మృతి
- అనారోగ్యంతో కన్నుమూత
- 2017 నుంచి పాక్ చెరలోనే
- భయం గుప్పిట్లో ఇతర మత్స్యకారులు
ఇటీవల పుల్వామా దాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇటీవలే భారత్ లోని అమృత్ సర్ జైల్లో పాక్ పౌరుడు మృతి చెందిన ఘటన ఎంత కలకలం రేపిందో తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొన్నిరోజుల వ్యవధిలోనే పాకిస్థాన్ జైల్లో ఓ భారత మత్స్యకారుడు మరణించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గుజరాత్ కు చెందిన 50 ఏళ్ల భిఖాభాయ్ భంభానియా అనారోగ్యంతో కన్నుమూసినట్టు తెలిసింది. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న భిఖాభాయ్ ని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మార్చి 4న ప్రాణాలు విడిచాడు. ఈ మేరకు పోరుబందర్ మత్స్యకారుల సంఘం నేత జీవన్ జంగీకి సమాచారం అందింది.
భిఖాభాయ్ మృతదేహం త్వరలోనే భారత్ చేరుకుంటుందని భావిస్తున్నారు. భిఖాభాయ్ స్వస్థలం గుజరాత్ తీరప్రాంతంలోని గిర్ సోమ్ నాథ్ జిల్లా పాల్డీ గ్రామం. భిఖాభాయ్ 2017 నవంబర్ 15న మరికొందరు మత్స్యకారులతో కలిసి అంతర్జాతీయ జలాల సమీపంలో చేపలు పడుతుండగా పాక్ దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ప్రస్తుతం భారత్, పాక్ మధ్య అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడిన తరుణంలో పొరుగుదేశం జైళ్లలో మగ్గుతున్న భారతీయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.