Andhra Pradesh: ఏపీ సీఎం డేటా చోరీ చేశారని ఎన్నికల ముందు ప్రచారం చేసేందుకే సిట్ వేశారు: నటుడు శివాజీ
- చంద్రబాబుపై లేనిపోని నిందలు వేసేందుకు ఇదంతా
- ‘డేటా చోరీ’ అనే ప్రచారానికి అసలు అర్థమే లేదు
- ఏపీ ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి బయటకొస్తా
ఏపీ సీఎం డేటా చోరీ చేశారని ఎన్నికల ముందు ప్రచారం చేసేందుకే సిట్ వేసిందని తెలంగాణ ప్రభుత్వంపై నటుడు శివాజీ మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, చంద్రబాబుపై లేనిపోని నిందలు వేసేందుకే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ‘డేటా చోరీ’ అనే ప్రచారానికి అసలు అర్థమే లేదని, ఈరోజుల్లో ‘డేటా’ అనేది ప్రతిచోటా లభ్యమవుతోందని, అనేక కార్యక్రమాలకు, పథకాలకు సమాచారం ఇస్తున్నారని అన్నారు. ఏపీ ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి తాను బయటకొచ్చి మాట్లాడతానని పేర్కొన్నారు.
తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో చాలా ఓట్లు గల్లంతయ్యాయని, సమాచార హక్కు చట్టం నుంచి తీసుకున్న సమాచారాన్నే తాను చెబుతున్నానని అన్నారు. ఇంటి పేర్ల ఆధారంగా ఓట్లు తొలగిస్తున్నారని, ఓటర్ల జాబితాలో తమ పేరు ఉందో లేదో ఓటు హక్కు ఉన్న ప్రతిఒక్కరూ చెక్ చేసుకోవాలని, తెలంగాణలో తొలగించిన ఓట్లను పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డేటా చోరీ వివాదంపై తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన సిట్ ల గురించి శివాజీ ప్రస్తావించారు. సిట్ లు ఏర్పాటు చేయడం ద్వారా ఏమవుతుందని ప్రశ్నించారు. కాగా, డేటా చోరీకి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలపై ఓ డెమో వీడియోను మీడియాకు శివాజీ విడుదల చేశారు.