Andhra Pradesh: ‘డేటా దుర్వినియోగం’ అని ఆరోపిస్తున్న పార్టీలన్నీ ఆ కోవకు చెందినవే: ప్రముఖ నటుడు శివాజీ
- టీఆర్ఎస్ ప్రభుత్వం నా ప్రశ్నకు సమాధానం చెప్పాలి
- నాడు తెలంగాణలో ఓట్లను తొలగించారు
- కేసీఆర్ కు ఎన్నికల సంఘం సహకరించింది
- అదే ప్లాన్ ఏపీలో చేయాలని కేసీఆర్ చూస్తున్నారు
డేటా చోరీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. అటు టీడీపీ, ఇటు టీఆర్ఎస్ పార్టీలు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో ప్రముఖ సినీనటుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ, డేటా దుర్వినియోగం అంటూ ఆరోపణలు చేస్తున్న పార్టీలన్నీ ఆ కోవకు చెందినవేనని ఆరోపించారు. డేటా చోరీ జరిగిందని ఆరోపిస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ముందుగా తన ప్రశ్నకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నాడు సకల జనుల సర్వే పేరుతో ప్రజల ఓట్లను వ్యూహాత్మకంగా తొలగించారని, అప్పుడు, కేసీఆర్ కు ఎన్నికల సంఘం సహకరించిందని ఆరోపించారు. ఈ విషయమై టీఆర్ఎస్ కు కేంద్రం పూర్తిగా సహకరించిందని అన్నారు. ఓట్ల తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ నేత మర్రి శశిధర్ రెడ్డి చేసిన ఫిర్యాదును పట్టించుకోలేదని విమర్శించారు. ఓట్ల తొలగింపు వ్యవహారం తెలంగాణలో సాఫీగా సాగిపోయిందని, అదే తరహాలో ఏపీలో చేయాలని కేసీఆర్ చూస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.