Preethi Reddy: మిస్టరీగా మారిన ప్రీతిరెడ్డి హత్యకేసు.. మరణానికి ముందు జరిగింది ఇదీ!
- హత్యకు ముందు ప్రీతిని కలిసిన మాజీ ప్రియుడు
- ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం చూశానన్న వారి కామన్ ఫ్రెండ్
- ఆత్మహత్యకు ముందు ప్రీతి స్నేహితురాలికి మెసేజ్ చేసిన హర్ష్
దంత వైద్యురాలు ప్రీతి రెడ్డి హత్యకేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఆస్ట్రేలియా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. అయితే, ఆమె మరణానికి ముందు ఏం జరిగి ఉంటుందన్న దానిపై వారికి అంతుచిక్కడం లేదు. అదృశ్యమైన ప్రీతిరెడ్డి మంగళవారం రాత్రి ఓ సూట్‌కేసులో శవమై కనిపించింది. ఆమె వేరొకరితో సన్నిహితంగా ఉన్నట్టు తెలిసిన మాజీ ప్రియుడు హర్ష్ నర్డే ప్రీతితో మాట్లాడేందుకు శనివారం టామ్‌వర్త్ నుంచి సిడ్నీ వచ్చాడు.
ఇద్దరూ కలిసి ఓ వైద్య సదస్సుకు హాజరయ్యారు. ఆ తర్వాత ఓ హోటల్ వద్ద ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటుండగా తాను చూశానని వారి స్నేహితుడొకడు పోలీసులకు తెలిపాడు. మరోపక్క, ప్రీతిరెడ్డి మృతదేహాన్ని కనుగొన్న ప్రాంతానికి 340 కిలోమీటర్ల దూరంలో సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో నర్డే కూడా ప్రాణాలు కోల్పోయాడు. కాగా, ప్రీతిరెడ్డి సిడ్నీలోని మెక్‌డొనాల్డ్స్ వద్ద ఒంటరిగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలు కనిపించాయి. తనకు పరిచయస్తుడితో అదే హోటల్‌లో ఆమె బస చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో ప్రీతి ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడారు.
ఆ తర్వాత కాసేపటికే నర్డే ఓ భారీ సూట్‌కేసును పోర్టర్ సాయంతో కారులోకి ఎక్కిస్తున్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. బహుశా అందులోనే ప్రీతి మృతదేహం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు, అదే రోజు రాత్రి ప్రీతి స్నేహితుల్లో ఒకరికి నర్డే మెసేజ్‌లు పెట్టిన విషయాన్ని గుర్తించారు. శనివారం సాయంత్రం ప్రీతితో మాట్లాడానని, ఇంటికి వెళ్తున్నానని చెప్పిందని ఎస్సెమ్మెస్ చేశాడు. అయితే, ఆమె కనిపించడం లేదని అవతలి వ్యక్తి చెప్పడంతో బహుశా ఎక్కడైనా నిద్రపోతుండవచ్చని సమాధానం ఇచ్చాడు.
ఆ తర్వాత యాక్సిడెంట్‌లో నర్డే మృతి చెందాడు. అయితే, అది యాక్సిడెంట్ కాదని, ఆత్మహత్యేనని పోలీసులు ఆ తర్వాత నిర్ధారణకు వచ్చారు. ఈ కేసులో మరెవరినీ అనుమానితులుగా భావించడం లేదన్న పోలీసులు నర్డేకు గతంలో ఎటువంటి నేర చరిత్ర లేదన్నారు.