Andhra Pradesh: ‘ఓటుకు నోటు’ కేసుపై స్పందించిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు!

  • కేసీఆర్ కు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి
  • నా జీవితంలో క్యారెక్టర్, విశ్వసనీయతకు చాలా విలువ ఇచ్చా
  • అమరావతిలో మీడియాతో మాట్లాడిన టీడీపీ అధినేత

నాలుగేళ్ల క్రితం ‘ఓటుకు నోటు’ కేసు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రకంపనలు రేపిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ విషయమై ఏపీ ముఖ్యమంత్రి మీడియా వద్ద స్పందించారు. అమరావతిలో ఈరోజు మీడియా సమావేశం సందర్భంగా ఓ విలేకరి మాట్లాడుతూ..‘ఓటుకు నోటు కేసులో మీరు ఇరుక్కున్నప్పుడు ఏపీ ఇంటెలిజెన్స్ విఫలమయింది. తాజాగా ఐటీ గ్రిడ్స్ సంస్థ వ్యవహారాన్ని సైతం పసిగట్టలేకపోయింది. టీడీపీ నుంచి మీరు తప్పా ఎవ్వరూ ఈ వ్యవహారంలో గట్టిగా ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు.

దీంతో చంద్రబాబు స్పందిస్తూ..’కాదమ్మా.. నేనేం అంటానంటే అప్పుడు(ఓటుకు నోటు కేసులో) కూడా ఏముంది? ఏంటి కేసులని వీళ్లు బెదిరించేది? ఎవరిని బెదిరిస్తారు? ఎన్నికలు వస్తుంటాయి. అలాంటప్పుడు కేడర్లు, లీడర్లు పది రూపాయలు ఖర్చు పెడుతుంటారు. అలాంటివాటికి నాకు ఏం సంబంధం? మీకు(జర్నలిస్టులకు) తెలియదా ప్రజాస్వామ్యం అంటే? కొందరు నగదును సేకరిస్తారు. మరికొందరు ఖర్చుచేస్తారు. కేసీఆర్ ఓ పార్టీ అధ్యక్షుడు కాదా? ఆయనకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయి?’ అని ప్రశ్నించారు. అన్నీ వదిలేసినవాడికి ఎలాంటి బాధా ఉండదని వ్యాఖ్యానించారు. ఈరోజు టాటా గ్రూప్ వంటి గౌరవప్రదమైన కంపెనీలపై దాడులు చేసే పరిస్థితికి వచ్చారని మండిపడ్డారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా జీవితంలో నా క్యారెక్టర్ కు, విశ్వసనీయతకు చాలా ప్రాముఖ్యత ఇచ్చాను. ఇప్పుడు నామీద నువ్వు(మోదీ) బురదచల్లుతున్నావ్. సీబీఐని పంపుతాం, ఈడీని పంపుతాం, ఐటీని పంపుతాం అని బీజేపీ నేతలు బెదిరిస్తున్నారు. జగన్ ను బలపర్చడానికి ఇప్పటికే చాలామందిని బెదిరించారు. హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నవాటికి నోటీసులు ఇచ్చారు. నేనే ఫామ్-7 ఇచ్చాను అని జగన్ చెప్పారు. వైసీపీ నేతలు 8 లక్షల ఓట్లు తొలగించారు. ఎంత దుర్మార్గం ఇది’ అని వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News