Andhra Pradesh: అధికారంలో లేకపోతేనే వైసీపీ నేతలు ఇన్ని దౌర్జన్యాలు చేస్తున్నారు.. రేపు అధికారం అప్పగించారంటే..!: సీఎం చంద్రబాబు హెచ్చరిక
- అరాచక శక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- దమ్ముంటే కేసీఆర్ నాతో అభివృద్ధిలో పోటీపడాలి
- అమరావతిలో టీడీపీ అధినేత మీడియా సమావేశం
తెలంగాణ ప్రభుత్వం టీడీపీ డేటాను దొంగిలించి ప్రతిపక్ష వైసీపీకి ఇచ్చిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. అధికారంలో లేకపోతేనే ఇన్ని దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తున్న వైసీపీ నేతలు రేపు అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతల పాలనలో ఏపీ ప్రజలకు రక్షణ ఉండదని హెచ్చరించారు.. ఈ అరాచక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలందరూ తమ ఓటు ఉందో లేదో చూసుకోవాలని సీఎం సూచించారు. ఐటీ గ్రిడ్స్, డేటా చోరీ వ్యవహారంలో అమరావతిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
దమ్ముంటే తనతో అభివృద్ధిలో పోటీ పడాలని కేసీఆర్ కు చంద్రబాబు ఈ సందర్భంగా సవాలు విసిరారు. ‘రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణకు 54 శాతం ఆదాయం వచ్చింది. అది ఎవరి వల్ల వచ్చింది? ఆరోజు కష్టపడ్డాం. ఒక ఎకో సిస్టమ్ అభివృద్ధి చేశాం. ఓ సైబరాబాద్, ఓ శంషాబాద్ ఎయిర్ పోర్టు, ఓ ఔటర్ రింగ్ రోడ్డులను నిర్మించాం. నా విజన్ అదే. వీటన్నింటిని నేనే సృష్టించా. హైదరాబాద్ నుంచి 60 సంవత్సరాల శ్రమను వదులుకుని వచ్చాం.
ఈ సందర్భంగా మీకు బాధగా లేదా? మీరు సృష్టించిన ఆస్తిని వదులుకుని వెళుతున్నారు కదా? అని చాలా మంది అడిగారు. వాళ్లకు నేను ఒకటే చెప్పా. ఆ ఆస్తిని ఇక్కడి వాళ్లు అనుభవిస్తారు. మేము కొత్తగా ఆస్తిని సృష్టించుకుంటాం అని సమాధానమిచ్చాను’ అని తెలిపారు. ఇప్పుడు ఏపీలో సంపద సృష్టి జరుగుతుంటే కూడా తట్టుకోలేకపోతున్నారని తెలంగాణ ప్రభుత్వంపై మండిపడ్డారు.