Andhra Pradesh: నేను 1984లోనే కంప్యూటరైజేషన్ వాడాను.. దాని ఆధారంగానే నేతలకు పదవులు ఇచ్చాను!: చంద్రబాబు

  • వైసీపీ నేతలు ప్రతీఊరిలో దౌర్జన్యం చేస్తున్నారు
  • కేసీఆర్ ఆ టెక్నాలజీని జగన్ కు ఇచ్చారు
  • మా డేటాతో కేసీఆర్ కు ఏం సంబంధం?

వైసీపీ అధినేత జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ తో కలిసి ఏపీని అతలాకుతలం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ 24 లక్షల ఓట్లను తొలగించారనీ, ఇప్పుడు అదే టెక్నాలజీని జగన్ కు ఇచ్చారని విమర్శించారు. ఫామ్-7 దరఖాస్తులు పెట్టాలని తానే చెప్పినట్లు జగన్ ఒప్పుకున్నారనీ, అంటే మా ఓట్లన్నీ తీసేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డేటా చోరీ వ్యవహారంపై అమరావతిలో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.

ఈ విషయమై చంద్రబాబు మాట్లాడుతూ..‘వైసీపీ నేతలు ప్రతీఊరిలో దౌర్జన్యం చేస్తున్నారు. ఎవరో వెళ్లి డేటా తీసుకుంటే మీకేం సంబంధం? ఎస్.. కార్యకర్తలు ఉన్నారు. వాళ్లు సమాచారం అడుగుతారు. మీరు కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు. అందులో తప్పు ఏంటి? కార్యకర్తలు ఓటర్ జాబితా సాయంతో ఎవరు ఏ పార్టీ వైపు ఉన్నారు? వాళ్లను మన పార్టీ వైపు ఎలా తీసుకురావాలి? అనే దిశగా పనిచేస్తారు.

అది వాళ్ల విధి. ఓటర్ల జాబితాను డిజిటల్ లేదా కాపీ రూపంలో ఉంచుకోవడంపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. మీకు తెలుసో.. లేదో.. నేను 1984లోనే కంప్యూటరైజేషన్ వాడాను. అప్పట్లోనే 6 లక్షల కంప్యూటర్ రికార్డులను అప్ డేట్ చేసి, పనితీరును అంచనా వేసి నేతలకు పదవులు ఇచ్చాను’ అని తెలిపారు. ఇప్పుడు ఆ పనే తాను చేస్తున్నాననీ, దీనితో కేసీఆర్ కు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఓ ప్రైవేటు కంపెనీ విషయంలో అసలు ప్రభుత్వం ఎలా జోక్యం చేసుకుంటుందని నిలదీశారు.

  • Loading...

More Telugu News