Andhra Pradesh: జగన్ కు నేనంటే చాలా ప్రేమ.. ఎంత ప్రేమంటే మైలవరంలో 7,141 ఓట్లను తీసేయాలని దరఖాస్తు ఇచ్చారు!: దేవినేని ఉమ
- నా నియోజవకర్గంలో తొలగించాలని ఫామ్-7 ఇచ్చారు
- ఈ విషయమై కలెక్టర్ ఇంతియాజ్ కు ఫిర్యాదు చేశాం
- విజయవాడలో మీడియాతో ఏపీ మంత్రి దేవినేని ఉమ
ఏపీ ప్రతిపక్ష నేత జగన్ ఎన్నికల వేళ కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ కు తనపై చాలా ప్రేమ ఉందనీ, అందుకే మైలవరం నియోజకవర్గంలో ఏకంగా 7,141 మంది టీడీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించాలని ఫామ్-7 దరఖాస్తులు ఇచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇందుకోసం తోటి ముద్దాయి, పలు కేసుల్లో నిందితుడిగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ ను రంగంలోకి దించారని దుయ్యబట్టారు. ఓట్ల తొలగింపుపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కు ఈరోజు ఫిర్యాదు చేసిన అనంతరం టీడీపీ నేతలతో కలిసి ఉమ మీడియాతో మాట్లాడారు.
మైలవరం నియోజకవర్గంలోని కేవలం 5 మండలాల్లోనే ఏకంగా 7,141 ఓట్ల తొలగింపునకు వైసీపీ కుట్ర చేసిందని ఆరోపించారు. ఈ ఘటన వెనుక ఉన్న కుట్రదారులందరిపై కేసు నమోదుచేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
భవిష్యత్తులో ఇలాంటి దుర్మార్గమైన పనులకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ మేరకు తాము కలెక్టర్ ఇంతియాజ్ ను కోరామన్నారు. ఫామ్-7 తామే ఇచ్చామని జగన్ నెల్లూరు సభలో స్వయంగా అంగీకరించారని గుర్తుచేశారు.