Haryana: దేశ విభజన సమయంలో విడిపోయారు... మళ్లీ ఇన్నాళ్లకు కలిశారు!

  • అనుబంధాన్ని గుర్తు చేసుకున్న అపూర్వ సోదరులు
  • ఒకే దేశంలో ఉన్నా ఆచూకీ తెలియక కలవని వైనం
  • పక్కపక్క ఊళ్లలోనే ఉన్నా ఎంతో దూరం దూరం

అనుబంధానికి మించిన ఆస్తులు ఏముంటాయి. అందుకే డెబ్బయి ఏళ్ల క్రితం విడిపోయిన సోదరులు ఇన్నాళ్లకు మళ్లీ కలవడంతో ఉప్పొంగిపోయారు. ఉబ్బితబ్బిబ్బయ్యారు. సుదీర్ఘ కాలం తర్వాతైనా కలిసినందుకు పొంగిపోయారు. హర్యానా రాష్ట్రంలో ఈ సంఘటన వెలుగు చూసింది.

అమిర్‌సింగ్‌ విర్క్‌, దల్బీర్‌సింగ్‌లు వరసకు సోదరులు. దేశ విభజన సమయంలో వీరి కుటుంబాలు పాకిస్థాన్‌ పరిధిలోని గుర్జన్‌వాలా ప్రావిన్స్‌లో ఉండేవి. అప్పటికి వీరి వయసు నాలుగేళ్లు. అన్నదమ్ములు ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ప్రాణం. విభజన సమయంలో ప్రావిన్స్‌లో అల్లర్లు చెలరేగడంతో రెండు కుటుంబాలు భారత్‌కు ప్రయాణమయ్యాయి. భారత్‌కి తరలిపోతున్న సమయంలో అమిర్‌సింగ్‌ కాలికి దెబ్బతగలగా దల్బీర్‌సింగ్‌ కట్టుకట్టాడు. అదే వారి ఆఖరి కలయిక.

ఆ తర్వాత అరాచక మూకలు వెంటాడడంతో ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నంలో రెండు కుటుంబాలు చెరొక మార్గం పట్టాయి. ఎవరు క్షేమంగా ఉన్నారో, ఎవరో పాకిస్థాన్‌ అరాచక శక్తుల చేతుల్లో హతులయ్యారో తెలియని పరిస్థితి. అయితే అదృష్టవశాత్తు ఆ రెండు కుటుంబాలు క్షేమంగా భారత్‌ చేరాయి. హర్యానా రాష్ట్రంలోని పానిపట్‌లో అమిర్‌, పక్కనే ఉన్న కర్నాల్‌లో దల్బీర్‌ కుటుంబాలు నివాసం ఏర్పర్చుకున్నాయి.

కానీ ఆ విషయం ఆ రెండు కుటుంబాలకు తెలియదు. అందుకే ఆ చిన్నారులు మరి కలవలేకపోయారు. పెద్దయ్యాక దల్బీర్‌ సైన్యంలో చేరగా, అమిర్‌  ఉత్తరాఖండ్‌లో వ్యవసాయదారుడిగా స్థిరపడ్డారు. విడిపోయినప్పటి నుంచి అమిర్‌ మనసు దల్బీర్‌ కోసం వెతుకుతూనే ఉండేది. 2014లో అమిర్‌ పాక్‌లోని గుర్జన్‌వాలాకు వెళ్లాడు. విభజన సమయంలో అక్కడే ఉండిపోయిన తన బంధువులను కలిసి వివరాలు సేకరించాడు.

1947 నాటి వివరాలతో ఉన్న ఓ వెబ్‌సైట్‌లో వెతకడం మొదలుపెడితే విశ్రాంత మేజర్‌గా దల్బీర్‌ నొయిడాలో స్థిరపడినట్లు తెలిసింది. నంబర్‌ సంపాదించి ఫోన్‌ చేస్తే దల్బీర్‌ పలికారు. విషయం తెలుసుకుని సంతోష సాగరం అయ్యారు. ఆ తర్వాత ఇద్దరు సోదరులు వ్యక్తిగతంగా కలుసుకుని మురిసిపోయారు.

  • Loading...

More Telugu News