Jagan: ఐటీ గ్రిడ్‌పై సిట్ విచారణ.. వింతగా ఉందన్న విజయశాంతి
- ఐటీ గ్రిడ్ వివాదంపై సిట్ ఏర్పాటు
- అప్పుడు మేం గగ్గోలు పెట్టినా కేసీఆర్ పట్టించుకోలేదు
- బీజేపీ కుట్రకు ఇది చక్కని ఉదాహరణ
ఆంధ్రప్రదేశ్-తెలంగాణ రాష్ట్రాల మధ్య యుద్ధానికి దారితీసిన ‘ఐటీగ్రిడ్’ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత విజయశాంతి స్పందించారు. ఈ కేసులో దర్యాప్తునకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడాన్ని ఆమె ఎద్దేవా చేశారు. పొరుగు రాష్ట్రంలోని వివాదానికి సిట్ వేసి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని కేసీఆర్ సర్కారు చెబుతోందని, మరి తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని అరిచి గీపెట్టినా ప్రభుత్వం పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పొరుగు రాష్ట్రంలో జరిగితే సిట్ వేస్తారని, అదే తెలంగాణలో అయితే ‘సిట్‘(కూర్చోండి) అంటూ ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కూడా ఇలాగే ఉంటుందేమోనని అనుమానం వ్యక్తం చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, వైసీపీ చీఫ్ జగన్, గవర్నర్ నరసింహన్‌ను కలిసి ఐటీ గ్రిడ్‌పై ఫిర్యాదు చేసిన కాసేపటికే తెలంగాణ ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించడం అనుమానాలకు తావిస్తోందన్నారు. మోదీ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో జరగుతున్న కుట్రకు ఇంతకు మించిన ఉదాహరణ అవసరం లేదని విజయశాంతి ఆరోపించారు.