Hari Prasad: ‘టీఆర్ఎస్ మిషన్’ అని నెట్లో కొడితే ప్రభుత్వ డేటా దుర్వినియోగ వీడియోలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి: ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్
- లేనివి తీసుకొచ్చి కేసులు పెట్టే ప్రయత్నం
- సేవా మిత్ర యాప్‌లో ఫామ్ 7 లేనే లేదు
- పోలీసుల దగ్గర సాక్ష్యాలు లేవు
సేవా మిత్ర యాప్‌లో ఉన్నవి ఓటరు ఫోటోలు కావని.. 54 లక్షల మంది టీడీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యుల ఫోటోలను ఆ యాప్‌కు అనుసంధానించినట్టు ఏపీ ప్రభుత్వ సాంకేతిక సలహాదారు హరిప్రసాద్ తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న డేటా వార్‌పై ఆయన ఓ ప్రముఖ ఛానల్‌తో మాట్లాడారు.
‘‘సేవా మిత్ర యాప్ అనేది ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం అప్పటి నుంచి వచ్చిన యాప్. ఓటు డిలీట్ చేసేందుకు సేవా మిత్ర యాప్‌లో ఫామ్ 7 లేనే లేదు. మా మెంబర్ షిప్ డేటాను వాళ్లు కొట్టేస్తే.. దానిలో మా ప్రతి ఒక్క కార్యకర్తకు సంబంధించిన సమాచారం ఉంది. దాని సాయంతో సులభంగా కాల్స్ చేయవచ్చు.
జగన్ మాట్లాడుతున్న డేటా విషయంలో కానీ లేదంటే.. పోలీస్ కమిషనర్ గారు మాట్లాడినవి చూస్తుంటే.. లేనివి తీసుకొచ్చి వీళ్లు కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతోందని నాకు అనుమానం కలుగుతోంది. అంతేకానీ వాళ్లు చెప్పే ఏ డేటా సేవా మిత్రలో దొరకడానికి ఆస్కారమే లేదు. తెలంగాణ పోలీసుల దగ్గర సాక్ష్యాలు లేవు. టీడీపీ పోలింగ్ బూత్ మెంబర్లను టార్గెట్ చేయడమే వారి పని. టీఆర్ఎస్ మిషన్ అని ఇంటర్నెట్లో వెదికితే టీఆర్ఎస్ ప్రభుత్వ డేటా ఎంతగా దుర్వినియోగం అవుతోందో వెల్లడించే వీడియోలు కుప్పలు తెప్పలుగా కనిపిస్తాయి. ఏపీలో ఒక పార్టీకి రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు ఈ కుట్ర జరుగుతోంది’’ అని హరిప్రసాద్ పేర్కొన్నారు.