Andhra Pradesh: బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్ సంస్థ పేరు రిజిష్టరే కాలేదు: ఏపీ బీజేపీ నేత సుదీశ్ రాంభొట్ల
- ‘బ్లూ ఫ్రాగ్’ పెద్ద కంపెనీ కావచ్చని అనుకున్నా
- ఈ విషయమై ఆరా తీసి ఆశ్చర్యపోయాను
- రిజిష్టర్డ్ కంపెనీల పేర్లలో దీని పేరే లేదు
ఏపీ ప్రజల డేటా చౌర్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థల్లో ఒకటైన ‘బ్లూ ఫ్రాగ్ టెక్నాలజీస్’ పేరు రిజిష్టర్ కాలేదని ఏపీ బీజేపీ నేత సుదీశ్ రాంభొట్ల అన్నారు. రిజిష్టర్డ్ సంస్థల పేర్లలో ఈ సంస్థ పేరు లేదని ఆరోపించారు. ఏపీకి చెందిన ఉన్నత స్థాయి అధికారులందరిని ఈ కంపెనీకి అప్పజెప్పారని విమర్శించారు.
ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని ఈ కంపెనీకి అప్పజెప్పారు కనుక, ఇదేదో పెద్ద కంపెనీ కావచ్చని అనుకున్నానని, ఈ విషయమై ఆరా తీస్తే, అసలు, రిజిష్టర్డ్ కంపెనీల పేర్లలో దీని పేరే లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘బ్లూ ఫ్రాగ్’ పేరిట మూడు కంపెనీలు రిజిష్టర్ అయి ఉన్నాయి కానీ, ఈ కంపెనీ పేరు మాత్రం అందులో లేదని అన్నారు. ఆ మూడు సంస్థలు ‘బ్లూ ఫ్రాగ్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్’, ‘బ్లూ ఫ్రాగ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్’, ‘బ్లూ ఫ్రాగ్ మొబెల్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్’ అని వివరించారు. అంటే, డేటా చౌర్యం కేసు పెద్ద కుంభకోణమని, రికార్డుల్లో ఎక్కడా దొరకకుండా ఉండేందుకే ఇలా చేశారని ఆరోపించారు.