Neerav Modi: నిబంధనలకు విరుద్ధంగా నీరవ్ మోదీ బంగ్లా.. డైనమైట్ తో కూల్చేస్తామంటున్న రాయ్‌గఢ్ కలెక్టర్
- ఆరు రోజులుగా బంగ్లాను కూల్చేందుకు యత్నం
- పునాది పటిష్టంగా ఉండటంతో ఫలించని కృషి
- 33 వేల చదరపు అడుగుల స్థలంలో బంగ్లా
- విలువ రూ.100 కోట్లకు పైమాటే
భారతీయ బ్యాంకులను వేలకోట్ల రూపాయలకు ముంచేసి, విదేశాలకు పరారైన నీరవ్ మోదీ బంగ్లాను డైనమైట్ పేల్చి కూల్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. గత ఆరు రోజులుగా మహారాష్ట్రలోని అలీబాగ్‌లో ఉన్న నీరవ్ మోదీ బంగ్లాను కూల్చేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ పునాది చాలా పటిష్టంగా ఉండటంతో కూల్చలేకపోతున్నారు. ప్రస్తుతం బంగ్లా చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న గదులను నేలమట్టం చేస్తున్నారు. ఈ భవనాన్ని అక్రమంగా, కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని అధికారులు స్పష్టం చేశారు.
33 వేల చదరపు అడుగుల స్థలంలో నిర్మించిన ఈ బంగ్లా విలువ రూ.100 కోట్లకు పైనే ఉంటుంది. అయితే భవనాన్ని కూల్చే విషయమై రాయ్‌గఢ్ కలెక్టర్ మాట్లాడుతూ.. ‘భవనాన్ని డైనమైట్ పెట్టి కూల్చేసేందుకు ఇప్పటికే రంధ్రాలు పెట్టాం. వాటిల్లో డైనమైట్‌ను అమర్చి శుక్రవారం దీన్ని కూల్చేయడానికి మాకు ఆదేశాలు అందాయి. రిమోట్ కంట్రోల్ సాయంతో దీన్ని ఆపరేట్ చేస్తాం. దీని వల్ల ఎటువంటి నష్టం కలగకుండా ఇప్పటికే చర్యలు తీసుకున్నాం’ అని తెలిపారు.