Chandrababu: జైల్లో పెట్టే నేరాలకు చంద్రబాబు, లోకేశ్ లు పాల్పడ్డారు: వైఎస్ జగన్ ఫైర్
- దేశ చరిత్రలో ఇలాంటి సైబర్ క్రైమ్ జరగలేదు
- చంద్రబాబు చేయకూడని పని చేశారు
- గవర్నర్ ను కలిసిన జగన్
జైల్లో పెట్టే నేరాలకు ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ లు పాల్పడ్డారని, దేశ చరిత్రలో ఇలాంటి సైబర్ క్రైమ్ ఎప్పుడూ జరగలేదని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. డేటా కుంభకోణం, ఏపీలో ఓట్ల తొలగింపు అంశాలపై గవర్నర్ నరసింహన్ కు జగన్, ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. అనంతరం, మీడియాతో జగన్ మాట్లాడుతూ, గవర్నర్ కు ఇచ్చిన వినతిపత్రంలో చంద్రబాబు చేసిన పనిని వివరించినట్టు చెప్పారు. రాబోయే రోజుల్లో ఎన్నికల ప్రధానాధికారిని కూడా కలిసి ఈ విషయమై ఫిర్యాదు చేస్తామని అన్నారు.
ఓ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నేరాలకు పాల్పడితే సైబర్ క్రైమ్ కాదా? అన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లామని అన్నారు. బహుశ రాష్ట్ర చరిత్ర, దేశ చరిత్రలో ఇలాంటి సైబర్ క్రైమ్ జరిగి ఉండదేమో అని అనుమానం వ్యక్తం చేశారు. ఒక పథకం ప్రకారం గత రెండేళ్లుగా ఎన్నికల ప్రక్రియను ఎలా మేనేజ్ చేయాలన్న దుర్బుద్ధితో చంద్రబాబు మేనేజ్ చేస్తున్నారని ఆరోపించారు. చేయకూడని పనిని చంద్రబాబు ఎలా చేశారని మీడియా కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఓ పథకం ప్రకారం ఓట్లను తొలగిస్తున్నారని, చంద్రబాబుకు వంతపాడే మీడియా ఆయన నిర్ణయాలకు భజన చేస్తోందని ఆరోపించారు.
‘ఐటీ గ్రిడ్’ సంస్థ పై దాడులు జరిగినప్పుడు ఆశ్చర్యకర విషయాలు బయట కొచ్చాయని, ‘సేవా మిత్ర’ టీడీపీకి సంబంధించిన యాప్ అని, దీన్ని తయారు చేసింది ఈ సంస్థేనని అన్నారు. ‘ఆధార్’ వివరాలు ప్రైవేట్ కంపెనీల వద్ద ఉండకూడదని, సేవామిత్ర యాప్ లో ఆధార్ లో వివరాలు దొరకడం క్రైమ్ కాదా? కలర్ ఫొటోలతో ఉన్న ఓటర్ల జాబితా ఎలా బయటకొచ్చింది? ఓటర్ల జాబితా ఐటీ గ్రిడ్ కంప్యూటర్లలో ఎలా కనబడుతోంది? ఏపీ ప్రజల బ్యాంక్ ఖాతాల వివరాలు ఈ యాప్ లో ఎలా ఉన్నాయి? అని ప్రశ్నించారు. ప్రజల వ్యక్తిగత వివరాలు ప్రైవేట్ సంస్థల వద్ద ఉండనే ఉండకూడదని అన్నారు. ప్రభుత్వమే ఇంటింటికి పంపి సర్వేలు చేయించి ఆ డేటాను కూడా సేవా మిత్ర యాప్ లో పొందుపరిచిందని ఆరోపించారు.