Andhra Pradesh: చంద్రబాబు అండతో ఏపీ డీజీపీ అక్రమాలకు పాల్పడుతున్నారు: వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల
- ఠాకూర్ అక్రమంగా హైదరాబాద్ లో ఇంటి నిర్మాణం
- పోలీస్ బాస్ అయితే ఆక్రమణలు చెల్లుతాయా?
- ఆ ఆక్రమణలను తొలగించాలన్న హైకోర్టు తీర్పు హర్షణీయం
సీఎం చంద్రబాబునాయుడు అండతో ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ అక్రమాలకు పాల్పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఠాకూర్ అక్రమంగా హైదరాబాద్ లో ఇంటి నిర్మాణం చేపట్టారని ఆరోపిస్తూ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఆ ఆక్రమణలు వెంటనే తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులను హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ఈ తీర్పును తమ పార్టీ స్వాగతిస్తోందని అన్నారు. 2010లో ఠాకూర్ ప్లాన్ అనుమతికి దరఖాస్తు చేసుకున్నారని, జీహెచ్ఎంసీ అనుమతి రాకున్నా ఇంటి నిర్మాణం చేపట్టారని అన్నారు.
అంతేకాకుండా, చిన్నారులు ఆడుకునే పార్క్ స్థలాన్ని కూడా ఆక్రమించారని ఆరోపించారు. భారీ స్థాయిలో ఇంటిని నిర్మించిన డీజీపీకి ఇంత పెద్దమొత్తంలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు ఇచ్చిన నోటీసులను ఠాకూర్ పట్టించుకోలేదని, సాక్షాత్తూ డీజీపీనే చట్ట ఉల్లంఘనకు పాల్పడుతుంటే ఇంకా ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడుతున్న డీజీపీ చట్టాలను కాపాడతామని అబద్ధాలు చెబుతున్నారని, ఠాకూర్ పోలీస్ బాస్ అయినంత మాత్రాన ఆక్రమణలు చెల్లుతాయా? అని ప్రశ్నించారు. కాగా, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 72, ప్రశాసన్ నగర్ లో ప్లాట్ నంబర్ 149లోని జీహెచ్ఎంసీ పార్క్ ను ఆక్రమించి ఠాకూర్ నిర్మించిన నిర్మాణాలను నిన్న టౌన్ ప్లానింగ్ అధికారులు కూల్చివేశారు.