ram janambhoomi: చరిత్ర గురించి మాకు చెప్పకండి.. బాబర్ చేసిన పనిని మార్చలేం: అయోధ్య కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
- ప్రస్తుత వివాదాన్ని పరిష్కరించడమే మన ముందున్న కర్తవ్యం
- దశాబ్దాలుగా ఈ వివాదం పరిష్కారానికి నోచుకోలేదు
- మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమవుతుందని ఒక్క శాతం నమ్మకమున్నా.. ముందుకెళదాం
అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదాన్ని పరిష్కరించే క్రమంలో మధ్యవర్తిని నియమించాలా? వద్దా? అన్న దానిపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ లో పెట్టింది. ఈ కేసును ఈరోజు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ బోబ్డే, జస్టిస్ చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషన్, జస్టిస్ అబ్దుల్ నజీర్ లతో కూడిన విస్తృత ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
అయోధ్య వివాదం భూమికి సంబంధించినది కాదని... సెంటిమెంట్, నమ్మకాలతో ముడిపడిన వ్యవహారమని సుప్రీం వ్యాఖ్యానించింది. వివాదం ఎంత తీవ్రమైనదో అందరికీ తెలుసని చెప్పింది. 'చరిత్ర గురించి మాకు చెప్పొద్దు. చరిత్ర మాకు కూడా తెలుసు. గతాన్ని మనం మార్చలేం. భారత్ పై ఎవరు దండయాత్ర చేశారు, మొఘల్ చక్రవర్తి బాబర్ ఏం చేశాడు, ఆ సమయంలో రాజు ఎవరు, అక్కడ ఉన్నది మసీదా లేకా ఆలయమా అనే విషయాలను మనం మార్చలేం. గతాన్ని మార్చే శక్తి మనకు లేదు. ప్రస్తుత వివాదం ఏమిటన్నది మనకు తెలుసు. ఈ వివాదాన్ని పరిష్కరించడమే మన ముందున్న కర్తవ్యం' అని జస్టిస్ బాబ్డే అన్నారు.
మధ్యర్తిత్వాన్ని ప్రజలు అంగీకరించరంటూ పిటిషనర్లలో ఒకరైన హిందూ మహాసభ వాదనపై స్పందిస్తూ.. మధ్యవర్తిత్వం విఫలమవుతుందని మీరు అంటున్నారని... ముందుగానే ఓ నిర్ణయానికి రావద్దని, మధ్యవర్తిత్వం వహించేందుకు తాము యత్నిస్తున్నామని సుప్రీంకోర్టు తెలిపింది. కోర్టు నియమించిన మధ్యవర్తికి ఈ అంశాన్ని అప్పగించాలా? వద్దా? అనే విషయంపై ఆదేశాలను జారీ చేస్తామని చెప్పింది.
దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని ఈ అంశం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమవుతుందేమో అనే కోణంలో పిటిషనర్లు ఆలోచించాలని ధర్మాసనం సూచించింది. సమస్య పరిష్కారమవుతుందనే నమ్మకం ఒక్క శాతం ఉన్నా... మధ్యవర్తిత్వానికి అంగీకరించాలని తెలిపింది.
అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని మూడు పార్టీలైన రామ్ లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖారాలకు సమానంగా పంచాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.