Boro Maa: నూరేళ్ల వయసులో కనుమూసిన 'బోరో మా'... అధికార లాంఛనాలతో అంత్యక్రియలు!
- వృద్ధాప్యం కారణంగా మృతి
- మతువా వర్గ ప్రజలకు నడిచే దేవత బినాపాణి దేవి
- సంతాపం వెలిబుచ్చిన ప్రధాని
పశ్చిమ బెంగాల్ లో మతువా వర్గం ప్రజలు నడిచే దేవతగా భావించే బినాపాణి దేవి (బోరో మా) నిన్న రాత్రి 8.52 గంటల సమయంలో కన్నుమూశారు. ఆమె వయసు 100 సంవత్సరాలు. వృద్ధాప్యం కారణంగా, పలు అవయవాలు పని చేయక, ఆమె మరణించినట్టు కోల్ కతాలోని ఎస్ఎస్కేఎం ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఆమె మృతి విషయాన్ని తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తదితర ప్రముఖులు సంతాపం తెలిపారు.
"గత నెలలో నేను బోరో మాను దర్శించుకుని ఆమె ఆశీస్సులు పొందాను. ఆమెతో మాట్లాడిన ప్రతిసారీ నేనెంతో ప్రేరణ పొందాను. ఈ విషాద సమయంలో మతువా వర్గ ప్రజలకు నా సంతాపం" అని మోదీ ట్వీట్ చేశారు. బోరో మా అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిపిస్తామని, 21 గన్స్ తో గౌరవవందనం సమర్పించనున్నామని మమతా బెనర్జీ తెలిపారు. ఆమె మృతి వ్యక్తిగతంగా తనకు తీరనిలోటని ఆమె అన్నారు.
కాగా, 2011, 2016లో మమతా బెనర్జీ సర్కారు అధికారంలోకి రావడానికి పశ్చిమ బెంగాల్ లోని మతువా వర్గం ఓట్లు అత్యంత కీలకం అయ్యాయి. వారంతా ఒకే మాటపై నిలిచి మమతకు మద్దతిచ్చారు.