Prime Minister: విపక్ష నేతల అనుమానాలు పాక్ మీడియాలో ముఖ్యాంశాలుగా ప్రసారం అవుతున్నాయి: ప్రధాని మోదీ
- ఉగ్రవాదానికి ఊతమిస్తున్న వారికి గట్టి జవాబిచ్చాం
- సరిదిద్దుకోవడం మినహా వారికి మరోమార్గం లేదు
- దాడులు పాక్ లో జరిగితే ఆ దెబ్బలు భారత్ లో కొందరికి తగిలాయి
పుల్వామా ఘటన నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)పై భారత్ జరిపిన వైమానిక దాడులపై విపక్షాల విమర్శలు చేయడంపై ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్ లోని ధార్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఉగ్రవాదులకు, ఉగ్రవాదానికి ఊతమిస్తున్న వారికి భారత్ గట్టి సమాధానమిచ్చిందని అన్నారు. సరిదిద్దుకోవడం మినహా వారికి మరోమార్గం లేదని, వాళ్లు ఇంకా మారకపోతే ఏమి చేస్తామో, ఏం జరుగుతుందో వారికి ఇప్పటికే స్పష్టం చేశామని అన్నారు.
భారత వైమానిక దాడులు పాకిస్థాన్ లో జరిగాయి కానీ, ఆ దెబ్బలు భారత్ లో ఉన్న కొంతమందికి తగిలాయంటూ విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. వైమానిక దాడులపై విపక్ష నేతలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు పాకిస్థాన్ మీడియాలో ముఖ్యాంశాలుగా ప్రసారం అవుతున్నాయని, అక్కడి టీవీ ఛానెళ్లలో వీరి ముఖాలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ మహా కల్తీ కూటమి నేతలు పాకిస్థాన్ కు ముఖచిత్రంగా మారారని, భారత్ జరిపిన వైమానిక దాడులకు ఆధారాలు కావాలని, ఉగ్రవాదులు ఎంత మంది మరణించారో అడుగుతున్నారని, వీళ్లు పాకిస్థాన్ ను కూడా శాంతి దూతగా అభివర్ణిస్తున్నారని దుయ్యబట్టారు.