London: లండన్ వ్యక్తికి హెచ్ఐవీ నుంచి విముక్తి... వైద్యరంగంలో సంచలనం
- పూర్తిగా మాయమైన వ్యాధికారక క్రిములు
- ఎయిడ్స్ వ్యాధికి మందు కనిపెట్టేందుకు ఊతం
- కొత్త ఉత్సాహంలో శాస్త్రవేత్తలు
ఎయిడ్స్ ఎంతటి ప్రాణాంతక వ్యాధో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దీని ప్రభావంతో ముఖ్యంగా 90వ దశకంలో పిట్టలు రాలినట్టు రాలిపోయారు. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ (హెచ్ఐవీ) అనే వైరస్ కారణంగా ఎయిడ్స్ వ్యాధి వస్తుంది. అయితే, ఈ వ్యాధి ఒక్కసారి సోకితే దీన్ని నిర్మూలించడం ఇప్పటివరకు అసాధ్యంగానే ఉంది. కానీ లండన్ కు చెందిన ఓ వ్యక్తి శరీరంలో హెచ్ఐవీ పూరిస్థాయిలో మాయం కావడం ఇప్పుడు వైద్యరంగంలో సంచలనం సృష్టిస్తోంది.
ఈ హెచ్ఐవీ బాధితుడికి 2003లో బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. మరో 13 ఏళ్లకు అది తీవ్రదశకు చేరుకుంది. దాంతో అత్యవసరంగా ఎముక మజ్జ మార్పిడి చేశారు. అందుకోసం జన్యుపోలికలు ఉన్న వ్యక్తి నుంచి ఎముక మజ్జ సేకరించి బాధితుడికి మార్పిడి చేశారు. ఆ మార్పిడి జరిగిన 18 నెలల తర్వాత ఆ లండన్ వ్యక్తి శరీరంలో హెచ్ఐవీ ఆచూకీ కనిపించలేదు. లండన్ లో అతడికి ట్రీట్ మెంట్ అందిస్తున్న రవీంద్ర గుప్తా అనే భారత సంతతి వైద్యుడు ఈ విషయం తెలియజేశారు.
గతంలో అమెరికాకు చెందిన తిమోతీ బ్రౌన్ కూడా అద్భుతం అనదగ్గ రీతిలో హెచ్ఐవీ నుంచి విముక్తి పొందాడు. అయితే, ఎముక మజ్జ మార్పిడి అనేది ఎంతో ఆర్థిక ప్రయాసతో కూడిన వ్యవహారం అని, దానికితోడు జన్యుపోలికలు ఉన్న వ్యక్తి లభ్యతపైనే వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే హెచ్ఐవీ నిర్మూలన దిశగా ఇది కీలక పరిణామం అని వైద్యరంగం భావిస్తోంది.