Andhra Pradesh: వైసీపీ నేతలు వేధిస్తున్నారని వాట్సాప్ మెసేజ్ పెట్టిన టీడీపీ కార్యకర్త.. పర్సనల్ గా చూసుకుంటానన్న నారా లోకేశ్!
- టీడీపీ కార్యకర్తలతో ముచ్చటించిన ఏపీ మంత్రి
- తనను వేధిస్తున్నారని టీడీపీ కార్యకర్త మీరావలి ఆవేదన
- తాను చూసుకుంటానని హామీ ఇచ్చిన లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఈరోజు టీడీపీ కార్యకర్తలతో ముచ్చటించారు. నియోజకవర్గాలవారీగా రాజకీయ పరిస్థితి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా తాను తీవ్రమైన కష్టాల్లో ఉన్నానని గుంటూరుకు చెందిన టీడీపీ కార్యదర్శి మీరావలి లోకేశ్ కి వాట్సాప్ మెసేజ్ పెట్టారు. గుంటూరులో ఇటీవల జరిగిన ‘నారా హమారా-టీడీపీ హమారా’ కార్యక్రమంలో వైసీపీ కార్యకర్తలు గోల చేస్తుంటే, అరవకుండా కూర్చోవాలని చెప్పానన్నారు.
అప్పటినుంచి తనపై కక్ష కట్టిన వైసీపీ నేతలు తప్పుడు కేసులు పెట్టి కోర్టుకు లాగారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై అన్యాయంగా రౌడీ షీట్ పెట్టారని బాధపడ్డారు. తన అన్నతో పాటు భార్యకు కూడా కేన్సర్ సోకిందని చెప్పారు. తాను ఏనాడూ పదవులు ఆశించలేదనీ, దయచేసి తనకు సాయం చేయాలని కోరారు. దీంతో వెంటనే స్పందించిన నారా లోకేశ్ ఆయనకు ఫోన్ చేశారు.
అనంతరం మాట్లాడుతూ.. ‘మీరావలి గారా అండీ. నేను లోకేశ్ నండీ. అన్నా.. మీరు వాట్సాప్ లో మెసేజ్ పెట్టారు కదా. మనవాళ్లు ఇప్పుడు ఫోన్ చేస్తారు. వివరాలు ఇవ్వండి. కోర్టు విషయం కావొచ్చు. ఇంకేదైనా సమస్య కావచ్చు. నేను పర్సనల్ గా చూసుకుంటా. బాధపడొద్దు. ధైర్యంగా ఉండండి. పార్టీ మీకు అండగా ఉంటుంది’ అని చెప్పారు.