Andhra Pradesh: వైసీపీ పల్లకీని టీఆర్ఎస్-బీజేపీలు మోస్తున్నాయి: ఏపీ స్పీకర్ కోడెల

  • ఆధార్ డేటా చోరీకి గురికాలేదు
  • టీఆర్ఎస్, పోలీసుల ఆరోపణలు కరెక్టు కాదు
  • వైసీపీ తీరు ‘దొంగే దొంగను పట్టుకోండి’ అన్నట్టు ఉంది

ఆధార్ డేటా చోరీకి గురికాలేదని, ఈ మేరకు టీఆర్ఎస్, పోలీసులు చేస్తున్న ఆరోపణలు కరెక్టు కాదని ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ అన్నారు.అమరావతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, డేటా చోరీ అంశంపై అసత్య ప్రచారం జరుగుతోందని అన్నారు. ప్రజలను తికమక పెట్టి రాజకీయపబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

 నరసరావుపేటలో తన ఓటు తొలగించమని తాను కోరినట్టుగా వైసీపీ నేతలు దరఖాస్తు చేస్తుంటే పట్టుకుని దాన్ని పక్కన పడేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఇలాంటి పనులు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు చేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ వాళ్ల ఓట్లను తాము లేకుండా చేస్తున్నామంటూ ఆ పార్టీ వాళ్లు  చేస్తున్న ఆరోపణలు ‘దొంగే దొంగను పట్టుకోండి’ అన్నట్టుగా ఉన్నాయని అన్నారు. ఇలాంటి సలహాలు వైఎస్ జగన్ రాజకీయ సలహాదారుడు ప్రశాంత్ కిషోర్ ఇస్తున్నారేమోనని అనుమానం వ్యక్తం చేశారు.

 ఓ స్పీకర్ గా తన బాధ్యతలు నెరవేరుస్తానని చెప్పిన కోడెల, రాజకీయాల నుంచి తాను రిటైర్మెంట్ తీసుకోవడం లేదని అన్నారు. టీడీపీ తనకు రాజకీయ జీవితం ఇచ్చిందని, పార్టీ కోసం తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ విజయం కోసం కష్టపడి పని చేస్తానని, కేవలం తన గెలుపు కోసమే కాకుండా, పార్టీ ఆదేశించిన చోటుకు వెళ్లి తమ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేస్తామని అన్నారు. వైసీపీని ఓ పల్లకీలో కూర్చోబెట్టి ఒకవైపు టీఆర్ఎస్, మరోవైపు బీజేపీ మోస్తున్నాయని ఆరోపించారు.

  • Loading...

More Telugu News