Andhra Pradesh: తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ లో యుద్ధం.. ‘డేటా గ్రిడ్’కు మద్దతుగా మూడు రాష్ట్రాల నుంచి ట్వీట్లు!
- విషయాన్ని సీరియస్ గా తీసుకున్న సర్కారు
- లోతుగా విచారించాలని పోలీసులకు ఆదేశం
- ముంబై, పూణే, బెంగళూరు, రాజస్థాన్ నుంచి ట్వీట్ల దాడి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ‘ఐటీ గ్రిడ్’ కంపెనీ వ్యవహారం కాకరేపుతోంది. ప్రజల సమాచారాన్ని దుర్వినియోగం చేశారని ఈ కంపెనీపై తెలంగాణ పోలీసులు కేసు నమోదుచేయగా, ఏపీ ప్రభుత్వ పెద్దలు దీనిపై తీవ్రంగా మండిపడ్డారు. తాజాగా ఈ వ్యవహారంలో కొందరు అజ్ఞాత వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో విమర్శిస్తున్నారు. ముంబై, పూణే, బెంగళూరు, రాజస్థాన్ నుంచి ఈ ట్వీట్లు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కాగా, ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ ట్వీట్ల సంగతి ఏంటో చూడాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించింది. కాగా ఏపీ-తెలంగాణ మధ్య వ్యవహారంపై ముంబై, బెంగళూరు, పూణే, రాజస్థాన్ నుంచి ట్వీట్లు రావడంపై అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏపీ ప్రజల సమాచారాన్ని అక్రమంగా సేకరించారని లోకేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఈ నెల 2న సైబరాబాద్ పోలీసులు ఐటీ గ్రిడ్ కంపెనీపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఈ కంపెనీ డైరెక్టర్ అశోక్ పరారీలో ఉన్నారు.