Andhra Pradesh: ఏ నేరం చేయకుంటే సీఎం చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు?: కేటీఆర్
- గోప్యత చట్టానికి ఏపీ సర్కార్ తూట్లు
- తప్పు చేయకుంటే ఉలికిపాటెందుకు?
- ఏపీ సీఎం టార్గెట్ గా కేటీఆర్ వరుస ట్వీట్లు
తెలుగుదేశం పార్టీకి సాంకేతిక సేవలు అందిస్తున్న ‘డేటా గ్రిడ్’ కంపెనీ వ్యవహారం కాకరేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేటు కంపెనీలకు ఇవ్వడం ద్వారా ఏపీ ప్రభుత్వం గోప్యత చట్టానికి తూట్లు పొడిచిందని కేటీఆర్ మండిపడ్డారు. చేయాల్సినదంతా చేసి ఇప్పుడు ‘ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే’ అనే రీతిలో తెలంగాణ ప్రభుత్వంపై పడి ఏడవడం ఎందుకని ఏపీ సీఎం చంద్రబాబును ప్రశ్నించారు.
ప్రస్తుతం బయటపడ్డ రిపోర్టుల ప్రకారం 3.5 కోట్ల మంది ఏపీ ప్రజల సమాచారాన్ని వారి అనుమతి తీసుకోకుండా ఓ ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టారని కేటీఆర్ తెలిపారు. ఈ వ్యవహారంపై తెలంగాణ పోలీసులు విచారణ జరుపుతున్నారని అన్నారు. ఓవైపు విచారణ జరుగుతుంటే ఏ నేరం చేయనప్పుడు చంద్రబాబు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ పోలీసులకు వ్యతిరేకంగా హైకోర్టులో తప్పుడు పిటిషన్లు దాఖలు చేయించారని కేటీఆర్ ఆరోపించారు.
తద్వారా ఈ వ్యవహారంలో తన పాత్ర ఉందని ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా అంగీకరించారని దుయ్యబట్టారు. ఈ విషయంలో ఏపీ ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. విచారణ జరిగితే డేటా దొంగతనం బయటపడుతుందని చంద్రబాబు భయపడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు కేటీఆర్ వరుస ట్వీట్లు చేశారు.