India: అభినందన్ జీవితంపై సినిమా.. జాన్ అబ్రహాం ఆసక్తి!
- టి-సిరీస్, సంజయ్ లీలా భన్సాలీ సంయుక్త నిర్మాణం
- దర్శకుడిగా అభిషేక్ కపూర్
- అభినందన్ పాత్రపై జాన్ అబ్రహాం ఆసక్తి
అభినందన్ వర్ధమాన్..! భారత్ లో ఇప్పుడొక రియల్ హీరో! శత్రు సైన్యానికి చిక్కినాగానీ అసామాన్య ధైర్యసాహసాలు ప్రదర్శించి దేశ రక్షణ రహస్యాలను కాపాడిన ధీరుడు ఈ భారత వాయుసేన వింగ్ కమాండర్. పాక్ సైన్యం కస్టడీలో దాదాపు రెండున్నర రోజులు గడిపినా చెదరని స్థయిర్యంతో దేశ ప్రతిష్ఠను ఇనుమడింపజేశాడు. దేశంలో ఇప్పుడెక్కడ చూసినా అభినందన్ గురించి చర్చించుకోవడం ఓ ప్రాధాన్య అంశంగా మారిపోయింది. అతడిపై భారతీయుల్లో అత్మీయాభిమానం పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో, అభినందన్ జీవితం ఆధారంగా ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
బాలీవుడ్ లో దిగ్గజ ఫిలింమేకర్ గా పేరుగాంచిన సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్ర నిర్మాణంలో పాలుపంచుకోవడం ఆసక్తి కలిగిస్తోంది. ప్రముఖ ఆడియో సంస్థ టి-సిరీస్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోంది. అభినందన్ బయోపిక్ కు అభిషేక్ కపూర్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. అయితే అభినందన్ పాత్ర ఎవరు పోషిస్తున్నారన్న దానిపై విపరీతమైన ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతానికి బాలీవుడ్ హంక్ జాన్ అబ్రహాం అభినందన్ పాత్రపై విపరీతమైన ఆసక్తి ప్రదర్శిస్తున్నాడు. అభినందన్ లాంటి రియల్ హీరో పాత్రను చేయమని ఎవరైనా అడిగితే నిస్సందేహంగా చేస్తానని స్పష్టం చేశాడు జాన్ అబ్రహాం.