Police: ఇవేం బాంబులురా బాబోయ్... ముక్కులు మూసుకుని పారిపోతున్న ఫ్రెంచ్ పోలీసులు!
- ఫ్రాన్స్ లో తీవ్రరూపం దాల్చిన నిరసన పర్వం
- వినూత్న దాడులతో బెంబేలెత్తిస్తున్న ఆందోళనకారులు
- అనూహ్యరీతిలో గాయాలపాలవుతున్న పోలీసులు
ఫ్రాన్స్ లో పోలీసు బలగాలకు ఇప్పుడో కొత్త చిక్కొచ్చిపడింది. యెల్లో వెస్ట్స్ నిరసనకారుల బృందం పోలీసులపై సరికొత్త ఆయుధాలను ప్రయోగిస్తుండడమే అందుకు కారణం. అవి మల పదార్థంతో తయారైన బాంబులు! పేడ, పెంటికలను తక్కువస్థాయి పేలుడు పదార్థంతో కలిపి ఈ వినూత్న విస్ఫోటకాలు రూపొందిస్తారు.
ఫ్రాన్స్ లో పన్నుల పెంపు ఇప్పుడు తీవ్ర ఆందోళనలకు దారితీస్తోంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఆందోళనకారుల పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు 11 మంది మరణించారు. ఈ నేపథ్యంలో, భద్రత బలగాలను చికాకుపెట్టడానికి ఆందోళనకారులకు ఇప్పుడీ పేడబాంబులే ప్రధాన అస్త్రాలయ్యాయి.
సంచుల నిండా పెంటికలు, మలం తీసుకువచ్చి పోలీసులపై కుమ్మరిస్తున్నారని, ముగ్గురు పోలీసులు మలంతో తడిసిముద్దయిపోయారని రూడీ మన్నా అనే పోలీసు అధికారి తెలిపారు. దక్షిణ రేవు ప్రాంతం మార్సెల్లీలోనే కాకుండా మాంటెపెల్లీర్ నగరంలో కూడా ఆందోళనకారులు ఈ పేడ బాంబులతో విరుచుకుపడుతున్నారట. నిరసనకారులు ఇలాంటి ఎత్తుగడలతో వస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదని ఆ అధికారి ఆవేదన వ్యక్తం చేశారు.