Andhra Pradesh: ఇప్పుడు కేసీఆర్ ప్రవర్తించినట్లు ఆనాడు కాంగ్రెస్ నేతలు కూడా ప్రవర్తించలేదు!: సీఎం చంద్రబాబు ఆగ్రహం
- కేసీఆర్ నియంతలా వ్యవహరిస్తున్నారు
- ఇలాంటి ప్రవర్తనను సహించబోను
- చరిత్ర తెలియకపోతే తెలుసుకో కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ నియంతలా వ్యవహరిస్తున్నారని ఏపీ సీఎం చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి నియంత ప్రవర్తనను తాను సహించబోనని హెచ్చరించారు. తాను ప్రపంచమంతా తిరిగి ‘హైదరాబాద్ లో మీ కంపెనీలు సురక్షితంగా ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవు’ అని నచ్చజెప్పి సంస్థలను తీసుకొచ్చానని గుర్తుచేశారు. ఇప్పుడు కేసీఆర్ ప్రవర్తించినట్లు ఆనాడు కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ప్రవర్తించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మదనపల్లెలో ఈరోజు జరిగిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి అన్యాయం జరిగిందని చంద్రబాబు తెలిపారు. ‘మాది ఒక రాష్ట్రం. మీది ఒక రాష్ట్రం. ఐటీ సంస్కరణలు తీసుకొచ్చాను. గత రెండు రోజులుగా ఐటీ.. ఐటీ అంటున్నారు. వీళ్లంతా ఇప్పుడు తాతకు దగ్గులు నేర్పిస్తున్నారు’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఏపీ ప్రభుత్వానికి డేటా ఉందనీ, తెలంగాణ ప్రభుత్వానికి కనీసం డేటా కూడా లేదని ఎద్దేవా చేశారు. తాను రోజూ 50 లక్షల మంది టీడీపీ కార్యకర్తలతో మాట్లాడుతానని వెల్లడించారు. చరిత్ర తెలియకపోతే తెలుసుకోవాలని కేసీఆర్ కు చంద్రబాబు సూచించారు. కేవలం నెల రోజుల వ్యవధిలో 65 లక్షల టీడీపీ సభ్యత్వాలను నమోదు చేశామని అన్నారు. ఇదంతా రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారానే సాధ్యమయిందన్నారు.