Andhra Pradesh: టీడీపీతో పెట్టుకుంటే మూలాలు కదిలిపోతాయ్.. ఎక్కడా తిరగలేరు!: జగన్, కేసీఆర్ కు చంద్రబాబు హెచ్చరిక
- టీడీపీ డేటాను వైసీపీకి ఇవ్వడానికే దాడులు
- జగన్, కేసీఆర్ లాలూచీ పడ్డారు
- మదనపల్లె సభలో నిప్పులు చెరిగిన చంద్రబాబు
తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికీ, పార్టీ డేటాను వైసీపీకి ఇవ్వడానికే తెలంగాణ పోలీసులు దాడులు చేశారని ఏపీ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఈ డేటా ఆంధ్రప్రదేశ్ ఆస్తి అనీ, దీనిపై విచారణ చేయడానికి మీరు ఎవరని ప్రశ్నించారు. ఏపీ డేటా హైదరాబాద్ లో ఉంటే వెంటనే తమకు పంపించాలని సూచించారు. ఈ విషయంలో ఎవ్వరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈరోజు నిర్వహించిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు.
అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ..‘తమ్ముళ్లూ.. మీకు అందరికీ తెలుసు. హైదరాబాద్ లో ఐటీ కంపెనీలు ఎలా వచ్చాయి? నావల్ల కాదా? సైబరాబాద్ నగరం ఎలా ఏర్పడింది? నావల్లే కదా తమ్ముళ్లూ’ అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ సురక్షితంగా ఉంటుందని తాను చెప్పాకనే మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చిందని తెలిపారు.
ఇప్పుడు దారినపోయే దానయ్య ఫిర్యాదు చేశాడని ఇలా సాఫ్ట్ వేర్ కంపెనీలపై దాడులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. కేసీఆర్ జగన్ తో లాలూచీ పడి టీడీపీని దెబ్బతీయాలని అనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘టీడీపీతో పెట్టుకుంటే మూలాలు కదిలిపోతాయ్.. ఎక్కడా తిరిగే పరిస్థితే ఉండదు’ అని హెచ్చరించారు.