Andhra Pradesh: అసెంబ్లీకి రారు.. ప్రజా సమస్యలు పట్టవు.. కానీ జీతాలు మాత్రం తీసుకుంటారు!: వైసీపీ నేతలపై చంద్రబాబు సెటైర్లు

  • ఎక్కడున్నా నేను చిత్తూరు బిడ్డనే
  • మదనపల్లెలో వైసీపీ గెలిచినా నీళ్లు ఇచ్చాం
  • జలసిరికి హారతి కార్యక్రమంలో ఏపీ సీఎం

ప్రాజెక్టులు, రిజర్వాయర్ల దగ్గర పడుకుని వాటి నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.తాను ఎక్కడున్నా ఈ గడ్డకు బిడ్డనేనని వ్యాఖ్యానించారు. సీమ ప్రజల కష్టాలు తీరడానికి పోలవరం ప్రాజెక్టును కడుతున్నామన్నారు. అది పూర్తవడానికి సమయం పట్టేలా ఉండటంతో పట్టిసీమ ప్రాజెక్టును చేపట్టామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఈరోజు జరిగిన ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో సీఎం మాట్లాడారు.

మదనపల్లె ప్రజలు వైసీపీ ని గెలిపించినా ఆ నేతలు ఏనాడూ ఇక్కడి నీటి సమస్యను పట్టించుకోలేదని చంద్రబాబు మండిపడ్డారు. ‘వైసీపీ నేతలు అసెంబ్లీకి రారు. ప్రజా సమస్యలను పట్టించుకోరు. అయినా జీతాలు మాత్రం తీసుకుంటారు’ అని ఎద్దేవా చేశారు. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. కుప్పం కంటే ముందుగా పులివెందులకు నీళ్లు ఇస్తామని తాను గతంలో ప్రకటించాననీ, దాన్ని చేతల్లో చేసి చూపామని వెల్లడించారు.

ఎన్నికల్లో గెలిపించకపోయినా పులివెందుల ప్రజలకు నీళ్లు ఇచ్చానని పేర్కొన్నారు. నాయకుడు సమాజహితం కోసం పనిచేస్తాడన్నారు. తాను ఇందిరాగాంధీ నుంచి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ చాలామందిని చూశానని తెలిపారు. దేశంలో ఎవ్వరూ చేయని విధంగా ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చంద్రబాబు తెలిపారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలంటే టీడీపీని ఆదరించాలని కోరారు.

చిత్తూరు పశ్చిమ మండలాలు టీడీపీకి కంచుకోట అనీ, అందుకే ఈ ప్రాంతం రుణం తీర్చుకుంటున్నానని చెప్పారు. ఈ నెల చివరికల్లా కుప్పానికి నీళ్లు తీసుకెళతామని ప్రకటించారు. ఈ ఏడాది జూలైలోనే పోలవరం నీటిని గ్రావిటీ సాయంతో కృష్ణా డెల్టాకు తీసుకొస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.

Andhra Pradesh
Telugudesam
Chandrababu
YSRCP
Chittoor District
jalasiriki harati
  • Loading...

More Telugu News