Andhra Pradesh: నీళ్లు లేక సీమ ప్రజలు వలసలు వెళ్లేవారు.. అందుకే ఎన్టీఆర్ ‘హంద్రినీవా’ చేపట్టారు!: సీఎం చంద్రబాబు

  • మహాశివరాత్రి రోజున నీటిని ఇస్తున్నాం
  • దీనితో నా జన్మ సార్థకం అయింది
  • చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఏపీ సీఎం

పవిత్రమైన మహాశివరాత్రి రోజున ఒక మహాజల శివరాత్రికి నాంది పలికామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. మదనపల్లెలోని చిప్పిలిచెరువుకు నీటిని ఇవ్వడంతో తన జన్మ సార్థకం అయిందని వ్యాఖ్యానించారు. తాను చిత్తూరులోనే పుట్టి, పెరిగాననీ, అంచెలంచెలుగా ఎదిగాననీ గుర్తుచేసుకున్నారు. చిత్తూరులో పశ్చిమ మండలాలు బెంగళూరు వాతావరణంతో ఉంటాయని చెప్పారు.

చిత్తూరు జిల్లాలో ఈరోజు ‘జలసిరికి హారతి’ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. చిప్పిలిచెరువు వద్ద హంద్రినీవా జలాలకు హారతి ఇచ్చారు. అనంతరం జలధార ఫేజ్-1, ఫేజ్-2 పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే పాల డెయిరీ, నెయ్యి ఉత్పత్తి ప్లాంట్, ఓ గొడౌన్ ను సీఎం ప్రారంభించారు.

అనంతరం మదనపల్లెలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఈ ప్రాంతవాసులకు నీటి కొరత లేకుండా చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని అన్నారు. గతంలో నీళ్లు లేక రాయలసీమ ప్రజలు వలసలు వెళ్లారన్నారు.

అందుకే 1984లో ఎన్టీఆర్ హంద్రీనీవాకు శ్రీకారం చుట్టారని గుర్తుచేశారు. గాలేరు-నగరి, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు ఎన్టీఆర్ చలువేనన్నారు. కృష్ణా, గోదావరి నదుల నీరు సముద్రంలోకి వృథాగా పోకుండా రాయలసీమకు తీసుకొచ్చేందుకు ఎన్టీఆర్ ప్రణాళికలు రచించారని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News