Amit Shah: 250 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టామన్న అమిత్ షా!
- గత వారం పాక్ పై లక్షిత దాడులు
- తొలుత 350 మంది తీవ్రవాదులు మరణించారంటూ వార్తలు
- 250 మందేనని గుజరాత్ లో చెప్పిన అమిత్ షా
గతవారంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోని బాలాకోట్ పై భారత వాయుసేన జరిపిన దాడుల్లో 250 మంది ఉగ్రవాదులు చనిపోయారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యానించారు. గుజరాత్ లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, వాయుసేన జరిపిన దాడుల్లో 250 మందికి పైగా ఉగ్రవాదులు మరణించారని అన్నారు. ఈ దాడుల్లో 350 మందికిపైగా ఉగ్రవాదులను మట్టుబెట్టారని తొలుత అనధికారిక వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నంబర్ పై పాకిస్థాన్ నుంచి ఒకలా, ఇండియా నుంచి మరోలా వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అసలు తమ దేశంపై దాడే జరగలేదని తొలుత, ఆపై భారత్ విసిరిన బాంబులు ఖాళీ ప్రాంతాల్లో పడ్డాయని పాక్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజాగా దీనిపై స్పందించిన అమిత్ షా, "ఉరీ ఉగ్రవాద దాడి తరువాత భారత సైన్యం పాక్ కు వెళ్లి లక్షిత దాడులు నిర్వహించింది. జవాన్ల మృతికి సైన్యం ప్రతికారం తీర్చుకుంది. పూల్వామా దాడి తర్వాత ఇదే తరహా దాడులు ఉండకపోవచ్చని అందరూ అనుకున్నారు. కానీ ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలో 13 రోజుల్లోనే వాయుసేన దాడులు చేసి 250 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది" అని ఆయన అన్నారు.