India-Pak: సరిహద్దుల్లో టెన్షన్ టెన్షన్.. కీలక సమావేశం ఏర్పాటు చేసిన మోదీ
- ప్రధాని ఆధ్వర్యంలో జాతీయ భద్రతా మండలి సమావేశం
- దేశ భద్రతపై వివరించిన అజిత్ దోవల్
- పాల్గొన్న కేంద్ర మంత్రులు
భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ భారత ప్రధాని నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జాతీయ భద్రతా మండలి (ఎన్ఎస్‌సీ) ఆదివారం రాత్రి సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్‌తోపాటు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా దేశ భద్రతకు సంబంధించిన అంశాలను ధోవల్ ప్రధాని మోదీకి వివరించారు.
పుల్వామా దాడి తర్వాత పాక్ భూభాగంలో భారత వాయుసేన నిర్వహించిన మెరుపు దాడుల తర్వాత ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు దొరికిన భారత పైలట్ అభినందన్‌ను ఇమ్రాన్ ప్రభుత్వం విడిచిపెట్టినప్పటికీ పరిస్థితులు మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉన్నాయి. ఈ క్రమంలో ప్రధాని ఎన్ఎస్‌సీ సమావేశం నిర్వహించడం పలు ఊహాగానాలకు తావిస్తోంది.