Train: కనెక్టింగ్ రైలు అందుకోలేదా?... వెనుక వచ్చే రైల్లో బెర్త్ లు ఖాళీ లేకున్నా ప్రయాణం!
- ఇక ప్రయాణాన్ని సాఫీగా పూర్తి చేసుకునే అవకాశం
- ప్రయాణికులతో సర్దుకుని ప్రయాణం చేసే వీలు
- త్వరలోనే వెలువడనున్న ఉత్తర్వులు
చేరుకోవాల్సిన గమ్యస్థానానికి నేరుగా రైలు లేకపోతే, మధ్యలో ఎక్కడి నుంచి అయినా కనెక్టింగ్ రైలుకు ముందస్తు రిజర్వేషన్ చేయించుకుని ప్రయాణాన్ని సాఫీగా పూర్తి చేసుకోవచ్చన్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఏవైనా కారణాలతో కనెక్టింగ్ రైలును అందుకోలేకుంటే, ఏ మాత్రం మినహాయింపులు లేకుండా టికెట్ నిమిత్తం కట్టిన డబ్బు మొత్తాన్ని తిరిగి ఇచ్చివేయాలని రైల్వేశాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1నుంచి అందుబాటులోకి కూడా రానుంది.
ఇక కనెక్టింగ్ రైలును అందుకోలేని ప్రయాణికుడు గమ్యస్థానాన్ని చేరుకునే వీలును కల్పిస్తూ, తరువాత వచ్చే రైళ్లలో రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణించే అవకాశం ఇవ్వాలన్న ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. ఖాళీ ఉంటే బెర్త్ లను కేటాయించాలని, బెర్తులు ఖాళీ లేకపోతే ఇతర ప్రయాణికులతో సర్దుకుని ప్రయాణం చేసే వీలును కల్పించాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు త్వరలోనే ఉత్తర్వులు వెలువడవచ్చని తెలుస్తోంది.