BSF: సరిహద్దులో కొనసాగుతున్న ఉద్రిక్తత.. రాత్రివేళ లైట్లు వేసుకోవద్దంటూ బీఎస్ఎఫ్ ఆదేశాలు
- బీఎస్ఎఫ్ ఆదేశాలతో గ్రామాల్లో అంధకారం
- లైట్లు వెలిగితే పాక్ దాడులకు తెగబడే అవకాశం
- అనుమానాస్పద వ్యక్తుల వివరాలు ఇవ్వాలన్న బీఎస్ఎఫ్
జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి తర్వాత వరుసగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో భారత్-పాక్ సరిహద్దు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. భారత ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్ సరిహద్దు గ్రామాలపై పాక్ దాడి చేసే అవకాశం ఉందన్న వార్తల నేపథ్యంలో బీఎస్ఎఫ్ అప్రమత్తమైంది. సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్ ప్రకటించిన బీఎస్ఎఫ్.. రాత్రివేళ దీపాలు వెలిగించొద్దని ఆదేశాలు జారీ చేసింది. సరిహద్దుకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బాణస్కంత జిల్లాలోని జలోయ, మావసారి, శివనగర్, మేఘపుర, రండోసాన్ గ్రామాల ప్రజలకు ఈ హెచ్చరికలు చేసింది.
బీఎస్ఎఫ్ ఆదేశాలతో ఆయా గ్రామాలు రాత్రివేళ చిమ్మచీకటిలో గడుపుతున్నాయి. భద్రతా దళాల ఆదేశంతో గ్రామాల్లో విద్యుత్ దీపాలను ఆర్పివేసినట్టు రండోసాన్ గ్రామ సర్పంచ్ దిలీప్ సిన్హా చౌహాన్ తెలిపారు. గ్రామంలో లైట్లు వెలిగి ఉంటే పాక్ దళాలు దాడికి తెగబడే అవకాశం ఉందని సిన్హా పేర్కొన్నారు. అలాగే, సరిహద్దుల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే బీఎస్ఎఫ్‌కు సమాచారం ఇవ్వాలంటూ గ్రామాల్లోని గోడలపై బీఎస్ఎఫ్ హెల్ప్‌లైన్ నంబరును రాసింది.