India: డాక్టర్లను ఒకే ఒక్క కోరిక కోరిన అభినందన్!
- త్వరగా పంపించండి... డ్యూటీలో జాయిన్ అవ్వాలి
- అభినందన్ కోరికతో ఆశ్చర్యపోయిన వైద్యులు
- సంపూర్ణ ఆరోగ్యంతో వింగ్ కమాండర్
భారత వీర పైలట్ అభినందన్ వర్ధమాన్ ప్రస్తుతం డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. పాకిస్థాన్ కస్టడీ నుంచి విడుదలైన అభినందన్ కు ఢిల్లీలోని భారత వాయుసేన ఆసుపత్రిలో ప్రత్యేకంగా వైద్యపరీక్షలు నిర్వహించారు. శని, ఆదివారాల్లో ఈ వింగ్ కమాండర్ కు నిర్వహించిన వైద్యపరీక్షల్లో అసాధారణ స్థితి ఏమీలేదని డాక్టర్లు తెలుసుకున్నారు. అయితే తనకు చికిత్స అందిస్తున్న డాక్టర్లతో అభినందన్ చెప్పిన మాటలు వింటే ఎవరైనా అచ్చెరువొందాల్సిందే!
తాను మళ్లీ యుద్ధవిమానం కాక్ పిట్ లోకి వెళ్లేందుకు ఎప్పుడెప్పుడా అని తహతహలాడిపోతున్నానని ఈ వింగ్ కమాండర్ వైద్యులకు తెలిపాడు. త్వరగా పంపిస్తే వెంటనే విధుల్లో జాయిన్ అవుతానని చెప్పడంతో డాక్టర్లతో పాటు అక్కడే ఉన్న ఐఏఎఫ్ అధికారులు కూడా ఆశ్చర్యపోయారు. అంతకుముందు, అభినందన్ కు మెడికల్ టెస్టులు చేసిన డాక్టర్లు అతడి వెన్నెముక కింది భాగంలో స్వల్ప గాయం ఉన్నట్టు గుర్తించారు. దానివల్ల అతడి ఆరోగ్యానికి ఇబ్బందేమీ లేదని తేల్చారు. అంతేకాకుండా, భారత వర్గాలు భయపడినట్టుగా అతడి శరీరంలో ఎలాంటి ఎలక్ట్రానిక్ బగ్స్ లేవని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.