ak 47: 7.5 లక్షల ఏకే-203 తుపాకులకు డీల్ కుదుర్చుకున్న భారత్.. ఇవి వస్తే శత్రువులకు నిద్ర కూడా పట్టదు!
- ఏకే-47లో లేటెస్ట్ వర్షన్ ఏకే-203
- తొలి విడతలో త్రివిధ దళాలకు అందజేత
- ఆ తర్వాత ప్యారామిలిటరీ, రాష్ట్ర పోలీసు బలగాలకు
యుద్ధ భూమిలో ఏకే-47 తుపాకులు పోషిస్తున్న పాత్ర ఏ స్థాయిలో ఉందో అందరికీ తెలిసిందే. ఈ లెజెండరీ తుపాకులకు సంబంధించిన లేటెస్ట్ ఆయుధం ఏకే-203. ఈ తుపాకులు శత్రువులకు నిద్ర కూడా లేకుండా చేస్తాయి. వీటిని తయారు చేస్తున్న రష్యన్ సంస్థతో 7.5 లక్షల తుపాకులకు భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సిబ్బంది వాడుతున్న ఇన్సాస్ అస్సాల్ట్ రైఫిల్స్ స్థానంలో వీటిని వినియోగించనున్నారు. తొలి విడతలో ఏకే-203లను త్రివిధ దళాలకు అందజేస్తారు. రెండో విడతలో పారామిలిటరీ, రాష్ట్ర పోలీసు బలగాలకు అందజేస్తారు.
దీంతోపాటు, ఇప్పటికే అమెరికన్ సిత్ సాయర్ సంస్థతో 7.69ఎంఎం 59 క్యాలిబర్ అడ్వాన్స్ డ్ అస్సాల్ట్ రైఫిల్స్ కోసం భారత రక్షణ శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఆయుధాలను సరిహద్దుల్లో చొరబాట్లను నియంత్రించే బలగాలకు అందజేయనున్నారు. ప్రస్తుతం వాడుతున్న ఇన్సాస్ రైఫిల్స్ పనితీరుపై ఎప్పటి నుంచో ఫిర్యాదులు ఉన్నాయి. పదేళ్ల క్రితమే వీటి స్థానంలో అత్యాధునిక రైఫిల్స్ అందజేయాలని భారత ప్రభుత్వం భావించింది. అయితే, టెండర్లు ఒక కొలిక్కి రాకపోవడంతో అది కార్యరూపం దాల్చలేదు.