Andhra Pradesh: ‘ఐటీ గ్రిడ్’ కేసులో ట్విస్ట్.. నలుగురు ఉద్యోగుల మిస్సింగ్ పై తెలంగాణ హైకోర్టులో పిటిషన్!
- హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసిన అశోక్
- నిన్నటి నుంచి నలుగురు సహోద్యోగులు కనిపించడం లేదని వెల్లడి
- ఇంటివద్దే అత్యవసరంగా విచారించాలని విన్నపం
తెలుగుదేశం పార్టీకి ఐటీ సేవలు అందిస్తున్న ‘ఐటీ గ్రిడ్’ కంపెనీ వివాదం మరింత ముదిరింది. ఇప్పటికే ఈ కంపెనీపై ప్రజల డేటాను బహిర్గతం చేయడం సహా పలు సెక్షన్ల కింద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన ఉద్యోగి ఒకరు తెలంగాణ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు.
తనతో పనిచేసే నలుగురు ఉద్యోగులు భాస్కర్, ఫణి, చంద్రశేఖర్, విక్రంగౌడ్ నిన్నటి నుంచి కనిపించడం లేదని ఐటీ గ్రిడ్ కు చెందిన అశోక్ పిటిషన్ లో తెలిపారు. నేడు ఆదివారం, రేపు మహాశివరాత్రి సెలవులు కావడంతో ఈ పిటిషన్ ను అత్యవసరంగా ఇంటివద్దే విచారించాలని న్యాయమూర్తిని కోరారు. ఈ నలుగురిని కోర్టు ముందు హాజరుపరిచేలా తెలంగాణ పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఈ పిటిషన్ ను మరికాసేపట్లో జడ్జి విచారించే అవకాశముందని భావిస్తున్నారు.