election commission: ఎన్నికల వ్యయం పరంగా ఏపీ సమస్యాత్మక రాష్ట్రం: రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది
- కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందని వెల్లడి
- అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచన
- జిల్లా స్థాయిలో పటిష్ట కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశం
ఎన్నికల వ్యయం పరంగా ఆంధ్రప్రదేశ్‌ను సమస్యాత్మక రాష్ట్రంగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించిందని, అందువల్ల ఎన్నికల అధికారులు పర్యవేక్షణ విషయంలో సదా అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది తెలిపారు. మద్యం, బహుమతులు, పెయిడ్ ఆర్టికల్స్ సమస్య రాష్ట్రంలో ఎక్కువని గుర్తించిందన్నారు. ఈ కారణంగా ఎన్నికల్లో బారీగా ధన వ్యయం జరుగుతుందని భావిస్తున్న ఈసీ అత్యధిక సంఖ్యలో పరిశీలకులను రాష్ట్రానికి పంపుతున్నట్లు తెలిపారు.
అమరావతిలో 13 జిల్లాల ఎంసీఎంసీ నోడల్ అధికారులు, మీడియా ప్రతినిధులతో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ద్వివేది మాట్లాడారు. ఈసీ సూచన నేపథ్యంలో జిల్లా స్థాయి అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని, పటిష్టమైన మోనటరింగ్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో పెయిడ్ ఆర్టికల్స్, సామాజిక మాధ్యమాల పట్ల అప్రమత్తత అవసరమని, ఇందుకోసం మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
పార్టీల కతీతంగా ఇటువంటి వ్యయాలను గుర్తించి అభ్యర్థుల ఖర్చులో జమ చేయాల్సిన బాధ్యత ఎంసీఎంసీలదేనని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ కొన్నిచోట్ల ఎంసీఎంసీలు ఏర్పాటు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నిచోట్ల ఐదారుగురు సభ్యులతో ఎంసీఎంసీలు ఏర్పాటు చేశారని, ఈ సంఖ్య సరిపోదని, అదనంగా మరో 15 నుంచి 20 మందిని కమిటీలో చేర్చాలని సూచించారు.
దేశంలో ఓటింగ్ యంత్రాలు వాడడం ప్రారంభించి 30 ఏళ్లవుతున్నా ఇంకా కొందరు వాటి పనితీరుపై అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందుకే రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో తొలిసారి వీవీ ప్యాట్లను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఓట్ల తొలగింపు దరఖాస్తుల సంఖ్య తగ్గిందని చెప్పారు. ఓటరు ప్రమేయం లేకుండా అతని ఓటు తొలగింపునకు ఎవరైనా దరఖాస్తు చేస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.