Uttar Pradesh: ‘కింగ్ మేకర్’ అనే పదం పాతకాలం నాటిది!: అఖిలేశ్ యాదవ్
- నేను కింగ్ మేకర్‌ను కావాలనుకోవడం లేదు
- కానీ కింగ్‌ను తయారుచేయడం ఎలాగో తెలుసు
- రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకే ‘మహాకూటమి’
‘కింగ్ మేకర్’ అనేది చాలా పాతకాలం నాటి పదమని, అయినా తాను కింగ్ మేకర్ కావాలనుకోవడం లేదని ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ పేర్కొన్నారు. ‘ఇండియా టుడే’ కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న అఖిలేశ్ మాట్లాడుతూ.. తాను ప్రధానిని కావాలనుకోవడం లేదని, కానీ ప్రధానిని మాత్రం నిర్ణయిస్తానని ధీమా వ్యక్తం చేశారు.
‘‘రానున్న ఎన్నికల్లో మీరు ‘కింగ్ మేకర్’ కావాలనుకుంటున్నారా?’’ అన్న ప్రశ్నకు అఖిలేశ్ బదులిస్తూ.. ‘‘కింగ్ మేకర్ అనే పదం చాలా పాతకాలం నాటిది. నేను సరికొత్తగా ఆలోచిస్తా. నాకు అంతకుమించి తెలియదు కానీ.. ప్రధానిని చేయడం ఎలాగో మాత్రం తెలుసు’’ అని పేర్కొన్నారు. అలాగే, ప్రతిపక్షాల ‘మహా కూటమి’ గురించి మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఏర్పడిన కూటమే ఇదని స్పష్టం చేశారు.