Cricket: కొరకరాని కొయ్యల్లా జాదవ్, ధోనీ... 6 వికెట్ల తేడాతో టీమిండియా ఘనవిజయం
- సత్తా చాటిన మిడిలార్డర్
- రాణించిన కెప్టెన్ కోహ్లీ
- హైదరాబాద్ వన్డేలో ఆసీస్ ఓటమి
టి20 సిరీస్ లో ఎదురైన వరుస ఓటములకు టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. శనివారం హైదరాబాద్ లో జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో ఆస్ట్రేలియాను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఆసీస్ విసిరిన 237 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మిడిలార్డర్ లో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' కేదార్ జాదవ్ 81, మహేంద్ర సింగ్ ధోనీ 59 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును గెలుపు తీరాలకు చేర్చారు. కెప్టెన్ కోహ్లీ 44 పరుగులు సాధించాడు. భారత్ 99 పరుగులకే 4 వికెట్లు కోల్పోయినా... జాదవ్, ధోనీ జోడీ అజేయమైన ఐదో వికెట్ కు 100కు పైగా పరుగులు జోడించి జట్టుకు విజయాన్నందించింది.
అంతకుముందు... టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓవర్లన్నీ ఆడినా 7 వికెట్లకు 236 పరుగులే చేయగలిగింది. ఓపెనర్ ఖవాజా 50, స్టోయినిస్ 37, మ్యాక్స్ వెల్ 40 పరుగులు సాధించారు. వికెట్ కీపర్ క్యారీ 36 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో షమీ, బుమ్రా, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లతో ఆసీస్ ను కట్టడి చేశారు. ఈ మ్యాచ్ లో గెలవడం ద్వారా భారత్ ఐదు వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక రెండో వన్డే మార్చి 5న నాగ్ పూర్ లో జరగనుంది.