Supreme Court: రాఫెల్ పిటిషన్లపై విచారణ మార్చి 6న
- డిసెంబర్ 14 తీర్పుపై రివ్యూ కోరుతూ పిటిషన్లు
- గతంలో దర్యాప్తు అవసరంలేదన్న సుప్రీం
- ఓపెన్ కోర్ట్ పద్ధతిలో విచారణ
రాఫెల్ యుద్ధ విమానాల వ్యవహారం ఇప్పట్లో తెమిలేట్టు కనిపించడంలేదు. రాఫెల్ జెట్ ఫైటర్ల కొనుగోలు వ్యవహారంపై దర్యాప్తు అవసరంలేదంటూ గతంలో సుప్రీం ఇచ్చిన తీర్పుపై పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై ఓపెన్ కోర్ట్ (బహిరంగ విచారణ) విధానంలో మార్చి 6న విచారణ చేపట్టనున్నట్టు అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కేంద్ర మాజీమంత్రులు యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరి పిటిషన్లతో పాటు, న్యాయవాది, సామాజికవేత్త ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన మరో పిటిషన్ పైనా సుప్రీం తాజాగా విచారణ చేపట్టనుంది. డిసెంబర్ 14న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన ఈ పిటిషన్లను పరిశీలిస్తామని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్ లతో కూడిన ధర్మాసనం తెలిపింది.