Andhra Pradesh: చంద్రబాబుకు దేశమంతటా చీవాట్లు పడ్డాయి.. అందుకే ఇప్పుడు బుద్ధి వచ్చి కొత్తపాట పాడుతున్నారు!: జీవీఎల్
- పాక్ నేతలు ఇక్కడివారికి హీరోలుగా కనిపిస్తున్నారు
- అభినందన్ విషయంలో రెండు రోజుల్లో పాక్ మెడలు వంచాం
- విజయవాడలో మీడియాతో మాట్లాడిన బీజేపీ నేత
పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన జైషే మొహమ్మద్ స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వానిదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు. 2016లోనూ మోదీ ప్రభుత్వం పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ఉగ్రమూకల దుశ్చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించబోమని భారత్ ఈ దాడులతో స్పష్టం చేసిందని వ్యాఖ్యానించారు. ఏపీలోని విజయవాడలో ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీవీఎల్ మాట్లాడారు.
భారత ముద్దుబిడ్డ అభినందన్ ను పాక్ పట్టుకుంటే మోదీ ప్రభుత్వం రెండు రోజుల్లోగా వారి మెడలు వంచి విడుదల చేయించిందని తెలిపారు. అభినందన్ భారత బలగాల ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచారని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ కు చెందిన నేతలు కొందరు ఇక్కడివారికి హీరోలుగా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. పాక్ ప్రజలు అక్కడి సైన్యం, ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే, కొందరు భారతీయ నేతలు మాత్రం పాకిస్థాన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పుల్వామా దాడిపై చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. ఇప్పుడు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలనే చంద్రబాబు ఇక్కడ వల్లెవేశారని మండిపడ్డారు. రోజూ చంద్రబాబు ఏం చెబుతున్నారన్న దాన్ని టీడీపీ నేతలు పాయింట్ల వారీగా రాసి మీడియాకు పంపుతున్నారనీ, దాన్నే మీడియా మిత్రులు కూడా ప్రసారం చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా చంద్రబాబుకు చీవాట్లు పడ్డాయన్నారు. దీంతో బుద్ధి వచ్చి ఇప్పుడు కొత్తపాట పాడుతున్నారని ఎద్దేవా చేశారు.