Andhra Pradesh: జమ్మలమడుగులో ఉద్రిక్తత.. వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు!
- నేడు ‘రావాలి జగన్-కావాలి జగన్’ కార్యక్రమం
- కడప జిల్లా సున్నపురాళ్లపల్లిలో ఏర్పాట్లు పూర్తి
- అనుమతి ఇచ్చి చివరి క్షణంలో అడ్డుకున్న పోలీసులు
కడప జిల్లా జమ్మలమడుగులో ఈరోజు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇక్కడి సున్నపురాళ్లపల్లిలో ఈరోజు ’రావాలి జగన్-కావాలి జగన్’ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందుకోసం ఇప్పటికే వైసీపీ నేతలు అవినాశ్ రెడ్డి, జమ్మలమడుగు ఇంచార్జ్ సుధీర్ రెడ్డి పోలీసుల నుంచి అనుమతి తీసుకున్నారు. ఈ కార్యక్రమం కోసం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకున్నారు.
అయితే ఈరోజు వైసీపీ నేతలు సున్నపురాళ్లపల్లికి వెళితే అక్కడ ఘర్షణలు తలెత్తే ప్రమాదముందని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ముందుజాగ్రత్త చర్యగా పోలీసులు పులివెందులలో అవినాశ్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు. సుధీర్ రెడ్డితో పాటు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. సున్నపురాళ్లపల్లిలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేతల ఒత్తిడితోనే పోలీసులు ఈ చర్య తీసుకున్నారని వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.