Pakistan: ఓ వైపు శాంతి మంత్రం...మరోవైపు కవ్వింపు తంత్రం.. తీరుమారని పాకిస్థాన్
- కాల్పుల విరమణ ఒప్పందం యథేచ్ఛగా ఉల్లంఘన
- సరిహద్దుల్లో కొనసాగుతున్న మోత
- పూంచ్, రాజౌరీ జిల్లాల్లో 10 మంది భద్రతా సిబ్బంది మృతి
ఓ వైపు శాంతి మంత్రం పఠిస్తూనే, మరోవైపు పాకిస్థాన్ తన కుతంత్రాన్ని కొనసాగిస్తోంది. నియంత్రణ రేఖ వద్ద యథేచ్ఛగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ బలగాలను కవ్విస్తోంది. తాజాగా పూంచ్, రాజౌరీ జిల్లాల్లో పాకిస్థాన్ కాల్పుల కారణంగా పది మంది భద్రతా సిబ్బంది మృతిచెందారు. వివరాల్లోకి వెళితే...ఐఏఎఫ్ వింగ్ కమాండర్ అభినందన్ విడుదల కావడంతో దాయాది దేశాల మధ్య శాంతి చర్చలు కొనసాగుతాయని ప్రపంచం భావిస్తోంది. కానీ భారత్ సైనిక స్థావరాలు, జనావాసాలే లక్ష్యంగా పాకిస్థాన్ తుపాకులు, హోవిట్జర్లు, మోర్టార్ షెల్స్‌తో సరిహద్దులో విరుచుకుపడుతోంది. పాకిస్థాన్ చర్యలను విజయవంతంగా భారత్ బలగాలు తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో ఐదుగురు భద్రతా సిబ్బంది, ముగ్గురు సీఆర్‌పీఎఫ్ జవాన్లు, ఇద్దరు పోలీసులు ప్రాణాలు కోల్పోయారు. ఒక సాధారణ పౌరుడు, మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.