Hyderabad: వెంటాడి...వేటాడి... నిందితుల తాట తీసిన పోలీసులు
- అర్ధరాత్రి ఆటో ఎక్కిన మహిళ దోపిడీ
- ఆటో డ్రైవర్‌తోపాటు అతని స్నేహితుల నిర్వాకం
- గమనించిన రక్షక్ సిబ్బంది వెంటపడడంతో చిక్కిన నిందితులు
రాత్రి రెండు గంటల సమయంలో తన ఆటో ఎక్కిన ఓ మహిళను దోచుకున్న ఓ ఆటో డ్రైవర్‌ను, అతని స్నేహితులను పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఘటన జరిగిన రోజే రక్షక్ సిబ్బంది వీరిని గమనించి వెంటాడడంతో తప్పించుకునే క్రమంలో నిందితులు ఆటో వదిలి పారిపోయారు. అందులో లభించిన సెల్‌ఫోన్ ద్వారా వీరి గుట్టుబయటపడడంతో కటకటాలు లెక్కిస్తున్నారు.
హైదరాబాద్, బంజారాహిల్స్ డివిజన్ పోలీసు కార్యాలయంలో పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్, ఏసీపీ కె.ఎస్.రావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి. హైదరాబాద్, శ్రీకృష్ణానగర్‌కు చెందిన ఓ మహిళ వరంగల్‌లో జరిగిన ఓ వివాహానికి హాజరై గత నెల 25వ తేదీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో అమీర్‌పేట మైత్రివనం కూడలిలో బస్సు దిగింది. తన ఇంటికి వెళ్లేందుకు అక్కడ ఉన్న ఆటో ఎక్కింది.
అప్పటికే ఆటోలో డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు వెనుక సీట్లో మహిళకు అటూ, ఇటూ కూర్చోగా, మరొకరు డ్రైవర్ పక్కన కూర్చున్నాడు. మార్గమధ్యలో ఒకడు దిగిపోయాడు. దీంతో డ్రైవర్ పక్కన కూర్చున్న వ్యక్తి వెనక్కి వచ్చి కూర్చున్నాడు. శ్రీకృష్ణానగర్ రాగానే సదరు మహిళ దిగేందుకు ప్రయత్నించగా ఆమెకు అటూ ఇటూ కూర్చున్న వారు అడ్డుకున్నారు. ఆటోను జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 10 వైపు మళ్లించారు. ఆమె మెడలోని గొలుసు, చేతి సంచి లాక్కున్నారు. మహిళ కేకలు వేయడంతో అటుగా వెళ్తున్న రక్షక్ సిబ్బంది బాలకృష్ణ, నాగేశ్వరరావులు దీన్ని గమనించి ఆటోను వెంబడించారు.
పోలీసులు వెంటపడడాన్ని గమనించిన దుండగులు మహిళను ఆటో నుంచి బయటకు తోసేశారు. ఆమెను వ్యాన్‌లోకి ఎక్కించుకున్న రక్షక్ సిబ్బంది విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేస్తూనే ఆటోను వెంబడించారు. ఆటో సిబ్బంది పోలీసులను తప్పుతోవ పట్టించేందుకు మహిళ నుంచి లాక్కున్న సంచిని బయటకు విసిరేశారు. అయినా వారు ఆగక పోవడంతో కొద్ది దూరం వెళ్లాక ఆటోను కూడా వదిలేసి సందుల్లో పడి పరుగందుకున్నారు. ఆటోను స్వాధీనం చేసుకున్న పోలీసులకు అందులో ఓ సెల్‌ఫోన్ లభించడంతో నిందితుల గుట్టు రట్టయింది.
సెల్‌ఫోన్‌లో లభించిన ఆధారాల మేరకు వారిని యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌కు చెందిన ఆటో డ్రైవరు మహ్మద్ మోసిన్ ఖాన్ అలియాస్ ఫైటర్ మోసిన్(25), శ్రీరాంనగర్‌కు చెందిన పండ్ల వ్యాపారి ఇమ్రాన్ ఖాన్(20), బోరబండ సైట్ 3 జ్యోతినగర్‌కు చెందిన ఆటో డ్రైవరు పరల్ మునిప్రకాశ్‌గా గుర్తించారు. వారిపై నిఘాపెట్టి నిమ్స్ సమీపంలో తిరుగుతుండగా నిన్న అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 2.6 తులా బంగారం స్వాధీనం చేసుకున్నారు.