Pakistan: భారత్ దాడితో మా అడవి నాశనం అయింది: పాక్ మంత్రి ఆరోపణ
- భారత వైమానిక దాడిలో పైన్ చెట్లు నేల కూలాయి
- భూమిపై పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయి
- ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేస్తాం
భారత వైమానిక దళం జరిపిన దాడిలో తమ దేశంలోని అటవీ ప్రాంతం తీవ్రంగా దెబ్బతిందని పాకిస్థాన్ మంత్రి మాలిక్ అమిన్ అస్లాం ఆవేదన వ్యక్తం చేశారు. భారత్ దాడిలో చెట్లు కూలిపోయి పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. ఈ విషయాన్ని ఇక్కడితో వదలబోమని, ఐక్యరాజ్య సమితిలో ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
భారత విమానాలు వేసిన బాంబుల వల్ల పైన్ చెట్లు కూలిపోయాయని, భూమిలో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని అస్లాం పేర్కొన్నారు. భారత్ వైమానిక దాడి జరిపినట్టుగా చెబుతున్న ప్రాంతానికి రాయిటర్స్ రిపోర్టర్లు వెళ్లగా అక్కడీ దృశ్యం కనిపించిందని మంత్రి వివరించారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం ప్రకారం పర్యావరణానికి హాని కలిగించడం అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడం కిందికే వస్తుందని మంత్రి పేర్కొన్నారు.