India: భారత గడ్డపై అడుగుపెట్టగానే అభినందన్ పలికిన మాటలివే!
- వాఘా వద్ద అపూర్వస్వాగతం
- సాదరంగా తీసుకెళ్లిన ఎయిర్ ఫోర్స్ అధికారులు
- హోరెత్తిన దేశభక్తి నినాదాలు
వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ శుక్రవారం రాత్రి భారత గడ్డపై కాలుమోపాడు. పాకిస్థాన్ కస్టడీ నుంచి విడుదలైన అభినందన్ ను అధికారులు వాఘా సరిహద్దు వద్ద భారత వర్గాలకు అప్పగించారు. లాంఛనాలు పూర్తయిన పిదప అభినందన్ వాఘా చెక్ పోస్ట్ నుంచి భారత భూభాగంలోకి ప్రవేశించాడు. తన దృఢచిత్తంతో దేశభక్తికి ప్రతిరూపంలా నిలిచిన అభినందన్ ను చూడగానే వాఘా వద్ద అభినందన్ జిందాబాద్ అంటూ నినాదాలు హోరెత్తాయి.
వాఘా బోర్డర్ కు వచ్చిన అభినందన్ బ్లేజర్, గ్రే పాంట్స్ ధరించి ఎంతో హుందాగా కనిపించాడు. అనంతరం తమ పైలట్ ను సాదరంగా తోడ్కొని వెళ్లారు భారత వాయుసేన అధికారులు. ఈ సందర్భంగా అభినందన్ తన స్పందన తెలియజేస్తూ... (ఇటీజ్ గుడ్ టు బీ బ్యాక్) "తిరిగి సొంతగడ్డపై అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉంది" అని వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. అమృత్ సర్ నగర డిప్యూటీ కమిషనర్ శివ్ దులార్ సింగ్ థిల్లాన్ తో మాట్లాడుతూ అభినందన్ ఈ వ్యాఖ్య చేసినట్టు సమాచారం.