India: అభినందన్ వీడియో సందేశం వైరల్... పాక్ అలా పలికించిందా!
- అభినందన్ వీడియోపై సందేహాలు
- అది ఎడిట్ చేసిన వీడియో అంటున్న నిపుణులు
- పాక్ కు మంచిపేరు వచ్చేలా వీడియో డిజైన్!
నా పేరు అభినందన్... నేను భారతీయ వాయుసేనలో పనిచేస్తున్నాను.. అంటూ స్వయంగా అభినందన్ పలికిన మాటలతో ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. పాకిస్థాన్ చెర నుంచి విడుదలయ్యే సమయంలో అభినందన్ పై పాక్ వర్గాలు ఈ వీడ్కోలు వీడియోను చిత్రీకరించాయి. అసలు తాను పాకిస్థాన్ సైన్యానికి ఎలా చిక్కిందీ, వారు తనతో ఎలా ప్రవర్తించిందీ అభినందన్ ఈ వీడియోలో చెప్పాడు. అతడు చెప్పాడనడం కంటే పాక్ సైనికాధికారులు బలవంతంగా చెప్పించినట్టు కనిపిస్తోంది. తన విమానం కూలిపోతుందని తెలియడంతో పారాచూట్ సాయంతో కిందికి దూకేశానని అభినందన్ ఆ వీడియోలో వివరించాడు.
"నేను కిందపడిపోయే సమయంలో అక్కడ చాలామంది గుమికూడి ఉన్నారు. పైకి లేచే సమయంలో నా పిస్టల్ కిందపడిపోయింది. వారి బారి నుంచి కాపాడుకునేందుకు పరుగులు తీశాను. వాళ్లు చాలా ఆవేశంతో నా వెంట పడ్డారు. అదే సమయంలో ఇద్దరు పాక్ జవాన్లు వచ్చి నన్ను సేవ్ చేశారు. తర్వాత వాళ్లు తమ యూనిట్ కు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేశారు. అక్కడ్నించి ఆసుపత్రికి తరలించారు. నా పట్ల పాక్ సైన్యం ఎంతో గౌరవంగా వ్యవహరించింది" అంటూ ఎంతో ముక్తసరిగా మాట్లాడడం చూస్తుంటే అది ఎడిట్ చేసిన స్క్రిప్ట్ అని అర్థమవుతోంది. పాకిస్థాన్ సైన్యానికి మంచిపేరు వచ్చేలా ఈ వీడియో డిజైన్ చేసినట్టుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.