Chandrababu: మోదీకి నాపై ఉన్న కోపం చూస్తే దొరికితే కొడతారేమో అనిపిస్తోంది!: చంద్రబాబు

  • అభినందన్ కోసం వెళ్లని ప్రధాని మమ్మల్ని విమర్శిస్తున్నారు
  • తిట్టడానికే విశాఖ వచ్చారు
  • ప్రధాని వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి నిప్పులు చెరిగారు. మోదీ శుక్రవారం విశాఖ బహిరంగ సభలో మాట్లాడిన కొద్దిసేపటికే చంద్రబాబు అమరావతిలో జరిగిన ఓ కార్యక్రమంలో విమర్శల వర్షం కురిపించారు. ఓవైపు దేశం మొత్తం అభినందన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ ప్రధాని మోదీ తిట్టడానికే విశాఖపట్నం వచ్చారని ఆరోపించారు.

దేశం గర్వపడేలా చేసిన వీర పైలట్ అభినందన్ కు స్వాగతం పలికేందుకు వెళ్లని వ్యక్తి ఇక్కడికొచ్చి తమను విమర్శిస్తున్నారని బాబు మండిపడ్డారు. అభినందన్ క్షేమంగా తిరిగొచ్చాడని మనమందరం సంబరంగా ఉంటే ప్రధాని మోదీ మాత్రం విశాఖ వచ్చి నల్లజెండాలతో స్వాగతం అందుకున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు.

సౌదీ యువరాజు వస్తే స్వయంగా వెళ్లి స్వాగతం పలికిన ప్రధానికి అభినందన్ వంటి దేశభక్తుడు కనిపించకపోవడం దారుణమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అభినందన్ కోసం వాఘా వెళ్లకుండా మనల్ని తిట్టడానికి విశాఖ రావడమా దేశభక్తి అంటే? అని నిలదీశారు. 'పుల్వామా ఘటన జరిగితే ప్రధాని మోదీ రాజస్థాన్ లో ఓ రాజకీయ సభలో పాల్గొన్నారు... ఆయన మమ్మల్ని విమర్శిస్తారు?' మరి అంటూ విమర్శలు గుప్పించారు. కుటుంబ పాలన గురించి మోదీ పదేపదే మాట్లాడుతున్నారని, అసలు ఆయనకంటూ ఓ కుటుంబం ఉంటే కదా కుటుంబం గురించి తెలిసేది? అంటూ ఎద్దేవా చేశారు.

రాజకీయాలను దేశభక్తితో ముడిపెట్టడం ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తికి సరికాదు అని హితవు పలికారు ఏపీ సీఎం. యుద్ధం వచ్చింది కాబట్టి ఎన్నికల్లో గెలుస్తామనుకుంటున్నారు... యడ్యూరప్ప చేసిన ఆ కామెంటే బీజేపీ రాజకీయానికి నిదర్శనం అంటూ మండిపడ్డారు. ప్రధాని చాలాకాలంగా మేకిన్ ఇండియా మేడిన్ ఇండియా, డిజిటల్ ఇండియా అని ఎన్నోసార్లు చెప్పారని, కనీసం వాటిలో ఒక్కటైనా జరిగిందా? అంటూ ప్రశ్నించారు. 'ఇలాంటివన్నీ అడుగుతున్నానని ప్రదాని మోదీకి నాపై చాలా కోపంగా ఉంది... కనిపిస్తే కొడతారేమో...' అంటూ ఛలోక్తి విసిరారు చంద్రబాబునాయుడు.

  • Loading...

More Telugu News