India: అభినందన్ జిందాబాద్.. అభినందన్ జిందాబాద్... మార్మోగిన వాఘా
- భారత గడ్డపై కాలుమోపిన అభినందన్
- పత్రాలు మార్చుకున్న ఇరు దేశాల అధికారులు
- అధికారికంగా ప్రకటించిన వాయుసేన
భారత వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ భారత్ లో అధికారికంగా కాలుమోపాడు. దీంతో 'అభినందన్ జిందాబాద్' అంటూ ప్రజలు హర్షధ్వానాలతో స్వాగతం పలికారు. శుక్రవారం మధ్యాహ్నం పాక్ కస్టడీ నుంచి విడుదలైన అభినందన్ ను వాఘా సరిహద్దుకు తరలించడంలో పాక్ విపరీతమైన జాప్యం చేసింది. అతడి డాక్యుమెంటేషన్ ప్రక్రియను అసాధారణ రీతిలో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు సాగదీసింది.
ఎట్టకేలకు రాత్రి 9 గంటల తర్వాత అతడిని వాఘా సరిహద్దు వద్ద భారత అధికారులకు అప్పగించారు పాక్ అధికారులు. దీనిపై భారత వాయుసేన అధికారిక ప్రకటన చేసింది. అభినందన్ కు స్వాగతం పలికేందుకు శుక్రవారం ఉదయం నుంచే వాఘా వద్దకు భారీగా ప్రజలు చేరుకున్నారు. ఈ సందర్భంగా వాఘా చెక్ పోస్ట్ వద్ద ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. అభినందన్ కు స్వాగతం పలికిన ఎయిర్ ఫోర్స్ అధికారులు అతడిని అమృత్ సర్ తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.