Chevireddy Bhaskar reddy: పోలీసులు కూడా పరోక్షంగా టీడీపీకి సహకరిస్తున్నారు: వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి ఆరోపణ
- అనుకూలంగా లేనివారి ఓట్లను తొలగిస్తున్నారు
- ప్రభుత్వ టెలికాన్ఫరెన్స్‌లలోనే ఆదేశాలిస్తున్నారు
- పోలీసులు కూడా టీడీపీకి సహకరిస్తున్నారు
టీడీపీపై వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి బాస్కర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఓటర్ల జాబితాలోని అక్రమాలపై నేడు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీకి అనుకూలంగా లేని వారి ఓట్లన్నీ తొలగిస్తున్నారని చెవిరెడ్డి ఆరోపించారు. ట్యాబ్‌లతో సర్వే చేసి మరీ బల్క్‌గా ఓట్లను తొలగిస్తున్నారని ఆయన అన్నారు. బీఎల్ఓలంతా టీడీపీవాళ్లేనని.. వాళ్లే ఓట్లను తొలగించమని అధికారులకు సూచిస్తున్నారన్నారు.
ఏకంగా ప్రభుత్వ టెలికాన్ఫరెన్స్‌లలోనే వైసీపీ ఓట్లను తొలగించమని.. 325 మంది బూత్ లెవల్ ఆఫీసర్లకు ఆదేశాలిచ్చారన్నారు. మరోవైపు పోలీసులు కూడా పరోక్షంగా టీడీపీకి సహకరిస్తున్నారని.. చిత్తూరు ఎస్పీ ఇంటికి పిలిపించి మరీ వైసీపీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారని ఆరోపించారు. చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్ల తొలగింపు కోసం 22 వేల దరఖాస్తులొచ్చాయని చెవిరెడ్డి పేర్కొన్నారు.